జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా విస్తృత ప్రచారం చేస్తోంది. డివిజన్లవారీగా అభ్యర్థులు గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆరేళ్లలో పరిష్కారం కాని సమస్యలను తాము పరిష్కరిస్తామని ప్రజల్లోకి వెళ్తున్నారు. మెహదీపట్నం డివిజన్‌లో భాజపా అభ్యర్థి గోపాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. గన్‌ఫౌండ్రీలో భాజపా అభ్యర్థి సురేఖ ఓం ప్రకాశ్ విస్తృతంగా పర్యటించి... ఓటర్లను కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నట్లు, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. సైదాబాద్ డివిజన్‌లో రోడ్‌షో నిర్వహించిన డీకే అరుణ.. భాజపా అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గోల్నాక డివిజన్, కాచిగూడ డివిజన్ పరిధుల్లో ప్రచారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఫలితమే గ్రేటర్‌లోనూ పునరావృతం అవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల్ని తెరాస మోసం చేస్తుంది..
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమీ నెరవేర్చకుండా ప్రజల్ని తెరాస మోసం చేసిందని భాజపా అభ్యర్థులు విమర్శించారు. జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌లోని పలు ప్రాంతాల్లో భాజపా అభ్యర్థి వెల్దండ వెంకటేశ్ ప్రచారం నిర్వహించి... తనకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బౌద్ధ నగర్‌ను దత్తత తీసుకున్నా ఎలాంటి అభివృద్ధి చేయలేదని... ఆ డివిజన్ భాజపా అభ్యర్థి మేకల కీర్తి ఆరోపించారు. అంబర్‌నగర్, పార్సిగుట్ట ప్రాంతాల్లో పాదయాత్ర చేసి... ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.