BJP Core committee meeting: మునుగోడులో జయకేతనం ఎగురవేయాలన్న పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ గెలుపు వ్యూహాలపై దృష్టిసారించింది. ఇవాళ పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ప్రజా గోసా-భాజపా భరోసా, పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాల అమలు వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశంపై సమీక్ష నిర్వహించారు.
మునుగోడులో రణనీతి: ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా బన్సల్ సూచించారు. మునుగోడులో రణనీతి అవలంబించాలని కేంద్ర ప్రభుత్వ పథకాలు, తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
ఈ నెల 7న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో భాజపా ఆధ్వర్యంలో బైక్ యాత్రలు చేపట్టనున్నట్లు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తెలిపారు. అలాగే 10వ తేదీన బూత్ కమిటీ సభ్యులతో బండి సంజయ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నట్లు పేర్కొన్నారు. కోర్ కమిటీ సమావేశంలో బైక్ యాత్రలో పాల్గొననున్న స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇంఛార్జ్‌లు, పార్టీ ముఖ్యనేతలు.. బూత్ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సూచించారని తెలిపారు.