BJP Operation Akarsh: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తుండగా.. ప్రధానాస్త్రమైన ఆపరేషన్ ఆకర్ష్‌కు సాన పెడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థులను బరిలో నిలపాలని భావిస్తోన్న భాజపా.. అందుకోసం ఇతర పార్టీల్లోని జన, ధన బలమున్న గెలుపుగుర్రాలను పార్టీలోకి లాగేసుకునేందుకు పావులు కదుపుతోంది. గోవా తరహా మోడల్ని భాజపా ఫాలో అవుతుంది. విభేదాలను పక్కన పెట్టి బలమైన నేతలను తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. గెలుపు గుర్రాల కోసం రాష్ట్రంలో భాజపా జాతీయ నాయకత్వం సర్వేలు నిర్వహించింది. సర్వే నివేధికల ఆధారంగా ఇతర పార్టీల్లోని బలమైన నేతలను గుర్తించింది. అధిష్ఠానం పంపించిన జాబితాలోని నేతలతో చర్చలు జరపాలని రాష్ట్ర నాయకులను అధిష్ఠానం ఆదేశించింది.
ఎక్కడైతే భాజపా బలంగా లేదో ఆ ప్రాంతాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నల్గొండతో పాటు వరంగల్, ఖమ్మంపై భాజపా గురి పెట్టింది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరిక దాదాపు ఖరారైనట్టే. మరోవైపు.. ఉమ్మడి వరంగల్‌లో కీలక నేతలతో పాటు, ఖమ్మంలోని పలువురు నేతలతో కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2 నుంచి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల మీదుగా సాగనుంది. అయితే.. ఆపరేషన్ ఆకర్ష్‌కు ఈ యాత్రను వాడుకునేందుకు కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు.