గ్లోబల్‌గా కొవిడ్ మహమ్మారి లైఫ్ సైన్సెస్, ఆరోగ్య రంగంలో ఎటువంటి మార్పులు తీసుకువచ్చింది అనే అంశంపై బయో ఆసియా సదస్సు ప్రధానంగా చర్చించనుంది. ఈ నేపథ్యంలో గ్లోబల్‌గా ఒక శక్తివంతమైన వ్యాక్సిన్ ప్రొవైడర్‌గా ఉన్న భారత్ తన ప్రస్తుత, భవిష్యత్ ప్రణాళికలను ఈ సదస్సులో పంచుకోనుంది. సదస్సులో పాల్గొనే సభ్యుులు, శాస్త్రవేత్తలు, పాలసీ మేకర్లు, ఫార్మా, బయోటెక్ కంపెనీల ప్రముఖులు అఫర్డబుల్ హెల్త్ కేర్ ఇవ్వటం గురించి, కొవిడ్ లాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాల్సిన సన్నద్ధతపై విస్తృత చర్చ చేపట్టనున్నారు.
రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్ర కీలక భాగస్వామిగా వ్యవహరించనుందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తోందని.. ఇప్పటికే గ్లోబల్ లైఫ్ సైన్సెస్ డెస్టినేషన్‌గా తెలంగాణ గుర్తింపు సాధించిందని జయేశ్ అన్నారు. ఈ క్రమంలో ఈ రంగంలో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, పాలసీ మేకర్లు, అకడమియా, పెట్టుబడిదారులు అందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు బయో ఆసియా సదస్సు ముఖ్య భూమిక పోషిస్తోందని జయేశ్ పేర్కొన్నారు.