హైదరాబాద్ మహానగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు... మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసుల చెక్ పెట్టారు. గతనెలలో సైఫాబాద్ పోలీస్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా... ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి చరవాణి అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.... సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అప్పటి వరకు 27 ద్విచక్రవాహనాలు చోరీ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. వారు ఇచ్చిన ఆధారాలతో మరో గ్యాంగ్‌నూ అదుపులోకి తీసుకున్నారు. రెండు ముఠాల్లోని 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
ముఠాలో ప్రధాన నిందితుడైన బజార్‌ఘాట్‌కి చెందిన అబ్దుల్ వాహెద్ అలియాస్ అఫ్రోజ్ బైక్ మెకానిక్. విలాసాలకు అలవాటు పడి దొంగతనాలకు తెరలేపాడు. తాళాలు లేకుండా బైకులు దొంగలించడంలో ఆరితేరాడు. మరో ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడి వరుస దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హర్షవర్దన్ అనే వ్యక్తి మరో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి బైకులు, చరవాణులు చోరీ చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన ఈ రెండు గ్యాంగ్‌లలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు వివరించారు.