నార్త్ బిహర్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్ పార్శిల్ జంక్షన్ వద్ద జరిగిన పేలుడుకు సంబందించిన లింక్ సికింద్రాబాద్‌లో వెలుగు చూసింది. పేలుళ్ల ఘటనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్ వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను దర్భంగా జీఆర్పీ రైల్వే పోలీసులు తీసుకున్నారు. జూన్ 15న ఓ రిజిస్టర్ పార్శిల్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ అనుమానితుడు దర్భంగాకు చేరవేసినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు.
పార్శిల్ ఆధారంగా..
జూన్ 17 న బిహార్ దర్భంగా రైల్వే స్టేషన్ పార్శిల్ జంక్షన్ వద్ద తక్కువ తీవ్రతతో పేలుళ్లు సంభవించాయి. ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పేలుడుకు సంబందించిన వస్త్రాలతో కూడిన ఓ పార్శిల్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. దీంతో దర్భంగా రైల్వే పోలీసులు ఆఫీసర్-ఇంఛార్జీ హరున్ రషీద్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం సికింద్రాబాద్‌లో విచారణ ప్రారంభించింది.