రాజేంద్రనగర్ బుద్వేల్‌లోని న్యూగ్రీన్‌సిటీ కాలనీలో 529 సర్వే నంబర్‌లో ఓ వ్యక్తి తన భార్య పేరిట 200 చదరపు గజాల స్థలం కొన్నారు. 1997లో రిజిస్టర్డ్ సేల్‌డీడ్ ద్వారా కొనుగోలు చేసిన ఆ స్థలానికి 2008లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసి.. రుసుం చెల్లించారు. 2009లో జీహెచ్‌ఎంసీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. 2018లో మరో వ్యక్తి కోర్టు నోటీస్ పంపారు. ఆ స్థలాన్ని 2018లో కొనుగోలు చేశానని.. రాజేంద్రనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తన పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందని అందులో పేర్కొన్నారు. ఆ వ్యక్తి స్థలం వద్ద బోర్డు పెట్టేందుకు యత్నించడంతో గత నెల 18న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజధానితోపాటు శివారు ప్రాంతాల్లో భూముల విలువలు పెరగడంతో తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి విలువైన స్థలాలపై కన్నేస్తున్నారు. న్యాయవివాదాలను సృష్టించి.. స్థలాలను కాజేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు.
బైనంబర్లతో రిజిస్ట్రేషన్ అయిన భూముల పత్రాలతో..
రాజధాని శివార్లలో రెండున్నర దశాబ్దాల క్రితం వరకు భూముల విలువ సాధారణంగానే ఉండేది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం అప్పుడప్పుడే ఊపందుకోవడంతో పలు సంస్థలు రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి.. వాటిలో హుడా లేఅవుట్ల ద్వారా వెంచర్లు వేశాయి. అయితే చాలా వెంచర్లలో పక్కాగా సర్వే చేసి హద్దులు నిర్ణయించలేదు. గతంలో పలు స్థిరాస్తి వెంచర్లకు తమ స్థలాల్లో కొంత విక్రయించిన భూయజమానులు.. మిగిలిన స్థలాలను తమ వద్దే ఉంచేసుకున్నారు. ఇప్పుడు వాటిని విక్రయిస్తుండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో బైనంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆ భూములపై వివాదాలొస్తాయంటూ యజమానుల నుంచి ముఠా సభ్యులు తక్కువ ధరకే కొంటున్నారు. లేదా వాటాలు మాట్లాడుకొంటున్నారు. భైనంబర్లతో రిజిస్ట్రేషన్ అయిన భూముల పత్రాలు(డాక్యుమెంట్లు) సమకూర్చుకుని.. పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వారు సహకరిస్తే వెంచర్లలో భూములు కొన్నవారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో సర్వే చేయలేదు కాబట్టి వివాదాలు వస్తాయంటూ భయపెట్టి.. బలవంతంగా తక్కువ ధరకు కొంటున్నారు. వారు అమ్మేందుకు ఇష్టపడకపోతే న్యాయవివాదాలు సృష్టిస్తున్నారు. ఇలాంటి ఓ వెంచర్ వివాదంలోనే కొద్దిరోజుల క్రితం ఇబ్రహీంపట్నంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది.