కోవిడ్ విషయంలో... తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై న్యాయ విచారణతోపాటు, ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు పలు మార్లు చివాట్లు పెట్టిన విషయాన్ని కూడా లోకసభ్‌లో ప్రస్తావించినట్టు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తిపై లోకసభలో నిబంధన 377 కింద భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చ లేవనెత్తినట్టు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల వివరాలను దాచి పెడుతోందని, మార్చి నుంచి జులై వరకు రోజువారీ పరీక్షల సంఖ్యను వెల్లడి చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
సెప్టెంబర్ మొదటి వారంలో కొత్తగా వెయ్యి కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనా... జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, గజ్వేల్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ఒక్క బెడ్ కూడా భర్తీ కాకపోవడం ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రధానంగా తెరాస ప్రభుత్వం కొవిడ్ గణాంకాలపై ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని, ఈ విషయంలో హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వంపై పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసినట్టు వివరించారు. మార్చి నుంచి జూన్ మధ్య... రాష్ట్రంలో కరోనా పరీక్షల రేటు చాలా తక్కువగా ఉందని, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, క్యాబినెట్ కార్యదర్శి కూడా పరీక్షలు పెంచాలని కోరుతూ పలుసార్లు జోక్యం చేసుకోవలసి వచ్చిందన్నారు.