ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని 2014లో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 15 వేల ఎకరాలను సేకరించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ అప్పట్లో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత రావటంతో రెండో దశగా 5 వేల 311 ఎకరాలకు తగ్గించి ప్రభుత్వం తిరిగి నోటిఫికేషన్ విడుదల చేసింది. చివరికి 2వేల 644 ఎకరాల్లోనే నిర్మాణం తలపెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరం జిల్లాలోని కంచేరుపాలెం, కవులవాడ, గూడెపువలస, ఎ. రావివలస, సవరవిల్లి, రావాడ రెవిన్యూ గ్రామాల పరిధిలో విమానాశ్రయం రానుంది.
ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో 2200 ఎకరాల్లోనే విమానాశ్రయం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. మిగతా 424 ఎకరాలను వాణిజ్య అవసరాలకు వినియోగించడం కోసం ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకోవాలని యోచిస్తోంది. అదేవిధంగా పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి జీఎంఆర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విమానాశ్రయం రాకతో స్థానికుల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే ఆనందం వ్యక్తం అవుతోంది. అలాగే రైతులు పీఓటీ యాక్ట్‌లో కోల్పోయిన భూమికి ప్రభుత్వం తగిన సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.