ఇంద్రకీలాద్రి సింధూర శోభితం.. కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. అమ్మవారిని దర్శించుకున్న భవానీ భక్తులు కొండ దిగువన మహామండపం వద్ద ఇరుముడులు సమర్పించి, నేతి కొబ్బరి కాయలను హోమగుండాల్లో వేసి దీక్ష విరమిస్తున్నారు.
ఉత్సవాల సందర్భంగా దేవస్థానం యాగశాలలో ఆలయ ప్రధానార్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్ నేతృత్వంలో వేదపండితులు, అర్చకులు చండీయాగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఈవో సురేష్‌బాబు పరిశీలించారు. ఇరుముడి సమర్పణ పాయింట్లు, భక్తులకు పాలు, ప్రసాదం పంపిణీ కౌంటర్లు సందర్శించి, అక్కడి పరిస్థితులు పర్యవేక్షించారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమ్మవారి దర్శనం..
మూడో రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రాత్రి 8 గంటల వరకు దర్శనాలు కొనసాగనున్నాయి. ఆర్జిత సేవలు రద్దు చేసి.. శ్రీచక్ర నవావరణార్చన, లక్షకుంకుమార్చన, శాంతి కల్యాణం తదితర సేవలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా మాస్కులు ధరించి, భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణమంతా జై భవానీ నామస్మరణతో మార్మోగుతోంది.
ఇదీ చదవండి: 'కొవిడ్ టీకాల పంపిణీ కోసం శరవేగంగా ఏర్పాట్లు'