Bharat Rashtra Samithi: తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు.ఇకపై తెరాస ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మారింది. రాష్ట్ర మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్‌పర్సన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సభ్యులందరూ తీర్మానాలపై సంతకాలు చేశాక.. మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేశారు. దీనితో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు.
దిల్లీలో కార్యాలయ ఏర్పాటుకు ఏర్పాట్లు వేగవంతం:మరో వైపు భారత్ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని దేశ రాజధాని దిల్లీలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. సర్ధార్ పటేల్ రోడ్‌లో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సర్దార్ పటేల్ మార్గ్‌లో ఉన్న జోధ్‌పూర్ రాజ వంశీయుల బంగ్లాను లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వసంత్ విహార్‌లో తెలంగాణ భవన్ పనులు వేగవంతం చేయనున్నట్లు తెలిసింది.