కొవిడ్-19 వ్యాధి నుంచి రక్షణ కోసం చిన్న పిల్లలకు ఇచ్చే ‘కొవాగ్జిన్’ టీకా రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. ఈ టీకాను 2 నుంచి 18 ఏళ్ల పిల్లలపై పరీక్షించి చూశామని, ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ‘ఇప్పటికే టీకా భద్రత ఖరారైంది. రోగ నిరోధకశక్తి (ఇమ్యునోజెనిసిటీ) ఎలా ఉందనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. నెల రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయి’ అని తెలిపారు. దీనికి సంబంధించిన క్లినికల్ పరీక్షల ఫలితాలపై భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి చెందిన విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) సంతృప్తి చెందితే చిన్న పిల్లల కోసం రూపొందిస్తున్న కొవాగ్జిన్ టీకాకు అనుమతి వస్తుందని వివరించారు. ఈ ప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ‘ఎఫ్‌ఇ హెల్త్‌కేర్ సమిట్’లో డాక్టర్ కృష్ణ ఎల్ల మాట్లాడారు. పిల్లలకు ఇచ్చే టీకాలపై రష్యా, అమెరికాలో ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఫైజర్- బయాన్‌టెక్ టీకాను పిల్లలకు ఇవ్వడానికి అమెరికాలో ‘అత్యవసర అనుమతి’ ఇచ్చారు. మన దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వారికే కొవిడ్-19 టీకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు ఇచ్చే టీకాలు లేవు. దీనిపై భారత్ బయోటెక్ నిర్వహిస్తున్న ప్రయోగాలు సఫలం అయితే అదే మన దేశంలో చిన్న పిల్లలకు ఇచ్చేందుకు అనుమతి పొందిన తొలి టీకా అవుతుంది.
కొవిడ్-19, రేబిస్‌లకు ఒకే టీకా!
కొవిడ్-19, రేబిస్‌లకు ఒకే టీకా ఇచ్చే అవకాశాలనూ తాము పరిశీలిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ ఎల్ల వివరించారు. అమెరికాలోని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ ఆఫ్ ఫిలడెల్ఫియా ఆవిష్కరించిన టీకాను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ‘డీ-యాక్టివేటెడ్ రేబిస్ వ్యాక్సిన్’ను ఉపయోగించి ఈ టీకాను ఆ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. తదుపరి అధ్యయనాలను నిర్వహించి పూర్తి స్థాయి టీకాగా రూపొందించేందుకు గత ఏడాదే భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రేబిస్ వ్యాక్సిన్ గట్టి రోగనిరోధక శక్తి ఇస్తున్నట్లు తేలినందున, దీనికి కరోనా వైరస్‌ను సైతం జోడించి ‘కాంబినేషన్ టీకా’ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనాలు చేస్తున్నట్లు కృష్ణ ఎల్ల తెలిపారు.
చుక్కల మందు టీకాతో మెరుగైన ఫలితాలు