తెలంగాణ

telangana

ETV Bharat / city

'శాస్త్రపరిశోధనలో ఎవరికీ తీసిపోం.. అన్ని రకాలుగా సత్తా చాటాం' - సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల వార్తలు

కొవిడ్‌-19 వ్యాధి నిరోధానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ తయారు చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకా పూర్తిగా సురక్షితమని, ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావులేదని ఆ సంస్థ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. ఇప్పటికే 16 వైరస్‌ టీకాలను ఆవిష్కరించి ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. వివిధ అంశాలపై ఆయన ఏమన్నారంటే..

'శాస్త్రపరిశోధనలో ఎవరికీ తీసిపోం.. అన్ని రకాలుగా సత్తా రుజువైంది'
'శాస్త్రపరిశోధనలో ఎవరికీ తీసిపోం.. అన్ని రకాలుగా సత్తా రుజువైంది'

By

Published : Jan 5, 2021, 4:12 AM IST

ప్రయోగాలు పూర్తికాకుండా కొవాగ్జిన్‌కు అనుమతి ఎందుకు ఇచ్చారని కొందరు అడుగుతున్నారు. 2019లో రూపొందించిన నిబంధనల ప్రకారం మనదేశంలో అత్యవసర పరిస్థితుల్లో మొదటి-రెండో దశ ప్రయోగాల ఆధారంగా టీకాలు, మందులకు అనుమతి ఇవ్వొచ్చు. 1-2 దశల్లో, ఇప్పుడు సాగుతున్న మూడో దశ పరీక్షల్లో కొవాగ్జిన్‌ తీసుకున్న వారు సురక్షితంగా ఉన్నారు. వీటిని పరిశీలించే ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.

మేము 26,000 మందిపై.. మరో కంపెనీ 100 మందిపైనే

బ్రిటన్‌లో జరిగిన పరీక్షల ఆధారంగా, మనదేశంలో కేవలం 100 మందిపై నిర్వహించిన ప్రయోగాల సమాచారంతోనే ఒక కంపెనీ టీకాకు భారతదేశంలో అనుమతి ఇచ్చారు. మూడోదశ పరీక్షలను 26,000 మందిపై జరుపుతున్న కొవాగ్జిన్‌కు అనుమతి ఇవ్వడాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏమొచ్చింది? మూడో దశ పరీక్షల సమాచారం మార్చి తర్వాత తెలుస్తుంది. ఈ సమాచారాన్ని విశ్లేషించే బాధ్యతను పారదర్శకత కోసం ఇక్వియా అనే అమెరికా కంపెనీకి అప్పగించాం.

ఫైజర్‌తో సమానంగా: ప్రయోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డీసీజీఐకి అందించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన జర్నల్స్‌లో ప్రచురించాం. ఫైజర్‌తో సమానంగా 5 పరిశోధనా పత్రాలు ప్రచురించాం. మొడెర్నా, స్పుత్నిక్‌-ఆర్‌డీఐఎఫ్‌, కాన్‌సినో, సైనోఫామ్‌, సినోవ్యాక్‌ సంస్థల పరిశోధనా పత్రాలు 3 కంటే తక్కువే.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ 10 శాతమే.. మరో సంస్థ టీకాకు 60 శాతం

మా టీకా ప్రయోగాల్లో కనిపించిన ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ 10 శాతం లోపే.. ఆక్స్‌ఫర్డ్‌ - ఆస్ట్రజెనెకా టీకాతో 60 శాతం మందిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించాయి. ఆ సంస్థ వాలంటీర్లకు టీకా ఇచ్చినపుడు దుష్ఫలితాలు బయటపడకుండా పారాసెట్మాల్‌ కూడా ఇచ్చారు. ఇటువంటివి మేము చేయలేదు.

మనదేశంలో అత్యవసర పరిస్థితుల్లో టీకాలు, మందులకు అనుమతి ఇచ్చేందుకు 2019 లో తీసుకువచ్చిన నిబంధనలు వీలుకల్పిస్తున్నాయి. దాని ప్రకారం మొదటి- రెండో దశ ప్రయోగాల ఆధారంగా అనుమతి ఇవ్వవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి సంప్రదాయం ఉంది. గతంలో ఎన్నో టీకాలకు (హెచ్‌1ఎన్‌1, ఎబోలా) క్లినికల్‌ పరీక్షలు పూర్తికాకుండానే అత్యవసర అనుమతి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. - డాక్టర్‌ కృష్ణ ఎల్ల, సీఎండీ, భారత్‌ బయోటెక్

కొవిడ్‌-19 వ్యాధి నిరోధానికి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ తయారు చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకా పూర్తిగా సురక్షితమని, ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావులేదని ఆ సంస్థ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన తర్వాత వివిధ పక్షాల నుంచి వచ్చిన విమర్శలను ఖండించారు. ‘మూడు టీకాలే మంచివి, మిగిలినవన్నీ నీళ్లే’ అని ఒకరు, ‘కొవాగ్జిన్‌ బ్యాకప్‌ టీకా మాత్రమే’ అని మరొకరు, ప్రయోగాలు పూర్తికాకుండా అనుమతి ఎందుకు ఇచ్చారని.. మరికొందరు చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు.

‘కొవాగ్జిన్‌పై మనదేశంలో ఇంతకు ముందెన్నడూ జరగని స్థాయిలో క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో అన్ని రకాలుగా దీని సత్తా రుజువైంది, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని డీసీజీఐ (డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది’ అని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. శాస్త్ర పరిశోధనల్లో తమకు ఎంతో అనుభవం ఉందని, ఇప్పటికే 16 వైరస్‌ టీకాలను ఆవిష్కరించి ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నామని వివరించారు. ఇన్‌-యాక్టివేటెడ్‌ వైరస్‌తో ఎంతో భద్రమైన రికార్డు గల వీరో సెల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మీద ‘కొవాగ్జిన్‌’ తయారు చేసినట్లు చెప్పారు. మూడో దశ క్లినికల్‌ పరీక్షలను 26,000 మంది వాలంటీర్లపై నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 24,000 మంది వాలంటీర్లపై ప్రయోగాలు మొదలయ్యాయని అన్నారు. మూడో దశ పరీక్షల సమాచారం మార్చి తర్వాత తెలుస్తుందన్నారు. యూకేలో జరిగిన పరీక్షల ఆధారంగా, మనదేశంలో కేవలం 100 మందిపై నిర్వహించిన ప్రయోగాల సమాచారంతోనే ఒక కంపెనీ టీకాకు అనుమతి ఇచ్చినప్పుడు, కొవాగ్జిన్‌కు అనుమతి ఇవ్వడాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏమొచ్చింది.

ఫైజర్‌కు ఏమాత్రం తీసిపోం

టీకా తయారీలో పారదర్శకత లేదంటూ వచ్చిన విమర్శలను కృష్ణ ఎల్ల వ్యతిరేకించారు. ప్రయోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అటు డీసీజీఐకి అందించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన జర్నల్స్‌లో ప్రచురించినట్లు తెలిపారు. ఫైజర్‌ 5 పరిశోధనా పత్రాలు ప్రచురిస్తే, తాము కూడా 5 పరిశోధనా పత్రాలు ప్రచురించామని, ఈ విధంగా తాము ఫైజర్‌కు ఏ మాత్రం తీసిపోమని డాక్టర్‌ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. మోడెర్నా, స్పుత్నిక్‌-ఆర్‌డీఐఎఫ్‌, కాన్‌సినో, సైనోఫామ్‌, సినోవ్యాక్‌ సంస్థల పరిశోధనా పత్రాలు 3 కంటే తక్కువని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పెద్ద సంస్థలతో భారత్‌ బయోటెక్‌ పనిచేస్తోందని చెబుతూ, మూడో దశ క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని విశ్లేషించే బాధ్యతను ఇక్వియా అనే అమెరికా కంపెనీకి అప్పగించినట్లు తెలిపారు. ఎటువంటి అనుమానాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

  • తమ టీకా ప్రయోగాల్లో కనిపించిన ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ 10 శాతానికి లోపు మాత్రమే ఉంటే, ఆక్స్‌ఫర్డ్‌ - ఆస్ట్రజెనెకా టీకాతో 60 శాతం మందిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించాయని అన్నారు. అస్ట్రజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాల్లో పాల్గొన్న వాలంటీర్లకు, దుష్ఫలితాలు బయటపడకుండా పారాసెట్మాల్‌ కూడా ఇచ్చారని, ఇటువంటివి తాము చేయలేదని పేర్కొన్నారు. మనదేశంలో ఇలా చేస్తే కంపెనీ మూసివేతకు డీసీజీఐ ఆదేశాలు ఇస్తుందని తెలిపారు.
  • ఇతర సంస్థల టీకాలు ప్రధానంగా కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ‘కొవాగ్జిన్‌’ మాత్రం స్పైక్‌ప్రొటీన్‌తో పాటు నూక్లియోక్యాప్‌సిడ్‌ను సమర్థంగా నియంత్రిస్తుంది.

‘కసౌలి’ ఇన్‌స్టిట్యూట్‌కు 50 లక్షల డోసులు

టీకా సరఫరా సన్నద్ధతపై స్పందిస్తూ, ఇప్పటికే తాము 2 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకా తయారు చేసి సిద్ధంగా ఉన్నట్లు డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. ఇందులో కసౌలిలోని సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 50 లక్షల డోసుల టీకా అందించామని వివరించారు. కొవాగ్జిన్‌ టీకా తయారీకి హైదరాబాద్‌లో మూడు యూనిట్లు, బెంగుళూరులో మరొక యూనిట్‌ సిద్ధం చేస్తున్నామని, నాలుగు యూనిట్లలో కలిసి ఏడాదికి 70 కోట్ల డోసుల టీకా తయారీ సామర్థ్యం ఉంటుందని తెలిపారు.

ఆగస్టు కల్లా 15 కోట్ల డోసులు

ఈ ఏడాది జులై- ఆగస్టు నాటికి 15 కోట్ల డోసుల టీకా సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తాము కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, ఫౌండేషన్ల నుంచి కానీ నిధులు తీసుకోలేదని, ఎంతో రిస్కు తీసుకుని, పూర్తిగా సొంత నిధులతో ‘కొవాగ్జిన్‌’ టీకా అభివృద్ధి చేశామని అన్నారు.

యూకే వైరస్‌ మీద కూడా పనిచేస్తుంది

యూకేలో కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ మీద కూడా ‘కొవాగ్జిన్‌’ టీకా పనిచేస్తుందని డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. వైరస్‌ రూపాంతరం చెందడం మామూలేనని, ఈ మార్పులను దృష్టిలో పెట్టుకునే టీకా రూపొందించినట్లు వివరించారు. ‘కొవాగ్జిన్‌’ మాత్రమే కాకుండా ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీకి సిద్ధమవుతున్నట్లు, దీనిపై క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.

వాడకం పెరిగాక టీకా ధర తగ్గుతుంది

‘కొవాగ్జిన్‌’ టీకా ధర ఎంత ఉంటుందన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ, సాధారణంగా టీకా ధరలు మొదట అధికంగా ఉంటాయని, వాడకం పెరిగే కొద్దీ, ఉత్పత్తికి అనుగుణంగా ధర తగ్గుతుందని వివరించారు. రొటావైరస్‌ టీకాను 1 డాలర్‌కు ఇవ్వగలుగుతున్నామని, దీన్ని తయారు చేస్తున్న మెర్క్‌, జీఎస్‌కే, భారత్‌ బయోటెక్‌ సంస్థలకు చెందిన టీకాలు ఒకే నాణ్యతను కలిగి ఉన్నాయని తెలిపారు. ‘కొవాగ్జిన్‌’ టీకా ధర విషయంలో ఇంకా స్పష్టత లేదని, ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉందని అన్నారు.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను

తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తాను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. తాను కేవలం ఒక శాస్త్రవేత్తను మాత్రమేనని, సైన్స్‌ మినహా తనను ముందుకు నడిపించే అంశం మరొకటి లేదని వివరించారు. పూర్తిగా దేశీయ టీకా అయిన ‘కొవాగ్జిన్‌’ స్ఫూర్తితో మనదేశంలో శాస్త్ర పరిశోధనలు బాగా పెరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. మనదేశంలోని ఒక కంపెనీ, మన దేశంలోని శాస్త్రవేత్తలు సాధించిన ఘనతను తూలనాడటం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో కొవిడ్‌-19 టీకాను ఆవిష్కరించే అవకాశం కలిగిందంటూ, ఆయా సంస్థల అధికార వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి:ఏ విదేశీ సంస్థకూ తీసిపోం.. యూకే స్ట్రెయిన్‌పైనా పనిచేస్తుంది: కృష్ణ ఎల్ల

ABOUT THE AUTHOR

...view details