ఎలాంటి లాభాలుంటాయి..
పాపాయికి తల్లిపాలు పట్టడం వల్ల బిడ్డకు కలిగే లాభాలు ఎన్నో. అప్పుడే పుట్టిన పాపాయి మొదటి ఆరునెలలు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఇతర ముఖ్యమైన పోషకాలన్నీ తల్లిపాలలో ఉంటాయి. ఫలితంగా ఇతర ఘనాహారం గానీ, ద్రవపదార్థాలు గానీ పాపాయికి అదనంగా పట్టాల్సిన అవసరం ఉండదు. తల్లి పాల నుంచి బిడ్డకు చేరే పోషకాలు పాపాయిని అనారోగ్యాల బారిన పడకుండా చేస్తాయి.
ఇన్‌ఫెక్షన్లు రావు..
ప్రసవమైన తొలిరోజుల్లో వచ్చేవి ముర్రుపాలు(కొలొస్ట్రమ్). కొన్ని ప్రాంతాల్లో ఉన్న రకరకాల నమ్మకాల వల్ల వాటిని పాపాయికి పట్టకుండా పారేస్తారు. కానీ పాపాయి ఆ పాలు తాగడం వల్ల కలిగే మేలు అంతాఇంతా కాదని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంటోంది. ఇందులో యాంటీబాడీలు, మాంసకృత్తులు ఎక్కువ. ఇవి ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి. అలాగే కామెర్లు రాకుండా కూడా చేస్తాయి. ఇందులో విటమిన్ 'ఎ' పోషకం అధికంగా ఉంటుంది. మన దేశంలో ఈ పాలు తాగనివారితో పోలిస్తే.. తాగే వారిలో శిశు మరణాలు ఐదారు రెట్లు తగ్గాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే తల్లిపాలు తాగే పిల్లలు మొదటి నెలల్లో చనిపోయే పరిస్థితులు పద్నాలుగు రెట్లు తగ్గుతాయని అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా తల్లిపాలు తాగని పిల్లలు పదిరెట్లు డయేరియా, పదిహేను రెట్లు శ్వాస సంబంధ సమస్యల కారణంగా పుట్టిన ఆరునెలలలోపే మరణించే అవకాశాలు ఎక్కువ. ఆ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. తల్లిపాల వినియోగాన్ని పెంచడం ఒక్కటే పరిష్కారం అంటారు వైద్యులు.
ఆ సమస్యలు రాకుండా..
పిల్లలకు భవిష్యత్తులో అలర్జీలు, ఆస్తమా లాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా, అతిగా బరువు పెరగకుండా చూడాలన్నా, ఓ వయసు వచ్చాక మధుమేహం, గుండెజబ్బులు, అధికరక్తపోటు లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రభావాన్ని తగ్గించాలన్నా, కొలెస్ట్రాల్ సమస్య లేకుండా ఉండాలన్నా.. తల్లిపాలు పట్టడానికి మించిన పరిష్కారం లేదని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. అలాగే చిన్నతనంలో క్యాన్సర్, పెద్దయ్యాక రొమ్ముక్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించడంలోనూ తల్లిపాల పాత్ర కీలకమే.
చురుగ్గానూ..
పిల్లలు ఒక్క చదువుల్లో రాణించడమే కాదు, కాగ్నిటివ్, మోటార్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడంలో కూడా తల్లిపాల పాత్ర ఎక్కువే. తల్లిపాలు తాగేవారిలో ఐక్యూ శాతం ఎక్కువని ఎన్నో అధ్యయనాలు రుజువు చేశాయి.
తల్లికీ మంచిదే..
కేవలం పిల్లలకే కాదు.. పాలివ్వడం వల్ల ఆ తల్లికీ ఎన్నో లాభాలున్నాయి. ప్రసవ సమయంలో వ్యాకోచించిన గర్భాశయం పాలు పట్టడం మొదలుపెట్టాక సంకోచిస్తుంది. రక్తస్రావం తగ్గుతుంది. తల్లిపాలు పట్టేవారు సులువుగా బరువు తగ్గి.. మునుపటి ఆకృతిని చాలా తక్కువ సమయంలోనే సొంతం చేసుకుంటారు. అలాగే వీరికి భవిష్యత్తులో రొమ్ము, అండాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పాపాయికి పాలు పట్టడం అనేది గర్భనిరోధక సాధనంగా కూడా పనిచేస్తుంది. దాంతో త్వరగా గర్భం రాకుండా ఉంటుందంటారు. పాపాయికి పాలు పట్టడం వల్ల దీర్ఘకాలంలో ఆస్టియోపొరోసిస్, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
ఈ సమస్యలకూ పరిష్కారాలున్నాయి..
సాధారణంగా పాలిచ్చే తల్లులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రసవం అయిన రెండు లేదా మూడురోజుల తరవాత కొందరు తల్లులకు రొమ్ముభాగంలో వాపు వస్తుంది. దీన్నో సమస్యగా భావిస్తారు కానీ జాగ్రత్తలు తీసుకుంటే ఆ అసౌకర్యాన్ని తగ్గించవచ్చు. కొత్తగా తల్లులైన వారికి ప్రత్యేకంగా బ్రాలు దొరుకుతాయి. వాటిని ఎంచుకోవాలి. ఎంత అసౌకర్యంగా అనిపించినా, పాపాయికి తరచూ పాలు పట్టాలి. అంతేకాదు.. ఒకే రొమ్ము నుంచి కాకుండా రెండింటి నుంచి పాలు పట్టాలి. గోరువెచ్చని నీటిలో బట్టను ముంచి రొమ్ములపై కాపడం పెట్టుకోవాలి. పాలు పట్టాక చన్నీళ్లతో ఐదు నుంచి పది నిమిషాలు కాపడం పెట్టుకోవడం తప్పనిసరి. దీనివల్ల పాలు పట్టినప్పుడు ఉండే అసౌకర్యం నెమ్మదిగా తగ్గుతుంది.
కొందరికి మొదటి వారాల్లో చనుమొనల్లో విపరీతమైన నొప్పి
అలాగే కొందరికి ప్రసవమైన మొదటి వారాల్లో చనుమొనల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. పాలు పడుతున్నప్పుడు సరైన, సౌకర్యంగా అనిపించే పద్ధతిలో కూర్చోవడం వల్ల ఈ సమస్యను అదుపు చేయొచ్చు. అలాగే చనుమొనలను శుభ్రం చేసేందుకు ఎట్టిపరిస్థితుల్లో సబ్బు వాడకూడదు. పాలు పట్టడం మొదలుపెట్టాక కొందరి తల్లుల చనుమొనలు ఎర్రగా మారి, వాచి, ముడతలు పడినట్లు అవుతాయి. ఈ పరిస్థితిని థ్రష్ నిపుల్స్ అంటారు. పాపాయి నోట్లో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఉంటే గనుక అది బిడ్డ నోటి నుంచి తల్లి చనుమొనలకు వ్యాపిస్తుంది. అలా ఈ సమస్య మొదలవుతుంది. ఇలాంటప్పుడు తల్లికి, పాపాయికి చికిత్స చేయాల్సి ఉంటుంది. వైద్యులు తల్లికి క్రీం లేదా ఆయింట్‌మెంట్లను సూచిస్తారు.
ఉద్యోగినులు ఏం చేయాలంటే..
కొందరు ఉద్యోగినులైన తల్లులు ప్రసవమైన కొన్ని నెలలకే విధులకు వెళ్లిపోతుంటారు. ఇలాంటివారికి బ్రెస్ట్‌పంప్ సరైన ప్రత్యామ్నాయం. తల్లిపాలను వీటిలో సేకరించడం కూడా సులువే. అయితే నాణ్యమైన బ్రెస్ట్‌పంప్‌ని ఎంచుకోవడం మంచిది. ఇందులోకి సేకరించిన పాలను గది వాతావరణంలో రెండుగంటలకు మించి ఉంచకూడదు. వీలైనంత త్వరగా ఫ్రిజ్‌లో భద్రపరచాలి. అదే డీప్‌ఫ్రీజర్‌లో అయితే మూడునెలల వరకూ నిల్వచేసుకోవచ్చు. అయితే బ్రెస్ట్‌పంప్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అలాగే ఫ్రిజ్‌లో ఉంచిన పాలను నేరుగా పాపాయికి పట్టకూడదు. పాలు పట్టాలనుకున్నప్పుడు ఆ పంప్‌ని ఇవతలకు తీసి సాధారణ కుళాయి నీటి కింద కాసేపు ఉంచాలి. దానివల్ల చల్లదనం తగ్గుతుంది. ఆ తరవాత పాపాయికి పట్టొచ్చు. వీటిని వేడిచేయకూడదు. ఓవెన్‌లోనూ పెట్టకూడదు.
అమ్మతనానితో పాటు అందానికీ ! ఇవీ చూడండి : కరోనాతో భర్త మృతి.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య