దీపావళి రోజున చిన్నా పెద్ద తేడా లేకుండా బాణాసంచా కాల్చి సంతోషాన్ని పొందుతారు. అంత వరకు బాగానే ఉంటుంది కానీ... ఏదైనా అనర్థం జరిగితే అవి కాస్తా సంబురాన్ని దూరం చేస్తాయి. ఆనందంగా వేడుకలు జరుపుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తయారీదారు వివరాలున్న టపాసులనే కొనుగోలు చేయాలని చెప్తున్నారు. ఇంట్లో దీపాలు వెలిగించేప్పుడు, టపాసులు కాల్చే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు.
- గాలి వీస్తున్నప్పుడు పైకి ఎగిరేవి కాల్చవద్దు. కాల్చే ముందు చుట్టుపక్కల ఇళ్ల తలుపులు, కిటికీలు మూసి ఉండేలా చూసుకోవాలి.
- కాల్చిన బాణాసంచాను బకెట్‌లో వేయాలి.
- బకెట్ నిండా నీటిని దుప్పట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
- కళ్లకు హానీ జరగకుండా అద్దాలు వాడాలి.
- చిన్నపిల్లలకు ఇవ్వకుండా పెద్దవారు దగ్గర ఉండి కాల్చేలా చూడాలి.
- నూలు, ఖద్దరు దుస్తులు మాత్రమే ధరించాలి.
- చేతులు దూరంగా చాచి క్రాకర్లు వెలిగించాలి.
అంతే కాకుండా బాణసంచా కాల్చిన వెంటనే... వాటి దగ్గరకు పోవద్దని నిపుణులు చెబుతున్నారు. దీపావళి సందర్భంగా సరోజినీ దేవి కంటి దవాఖానాలో 24 గంటల పాటు అందుబాటులో ఉండనున్నట్లు వైద్యులు తెలిపారు.