Power bills fraud: విద్యుత్ బిల్లుల చెల్లింపు పేరుతో కొంత మంది వ్యక్తులు వినియోగదారులను మెసేజ్లు, ఫోన్ల ద్వారా సంప్రదించి మోసం చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అవి వెంటనే కట్టకుంటే రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వినియోగదారులను బెదిరించి వారి బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు వివరాలు తీసుకుని అందికాడికి దండుకుంటున్నారు. వేర్వేరు పోలీస్స్టేషన్ల పరిధిలో కరెంట్ బిల్లుల మోసాలపై 29 వరకు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 11 లక్షల వరకు సొమ్మును సైబర్ నేరగాళ్లు దండుకున్నారు. ఇటువంటి మోసాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నట్టు.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ దృష్టికి వచ్చింది.
కరెంటు బిల్లుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి సూచించారు. బిల్లుల చెల్లింపుల కోసం సంస్థ వినియోగదారుల బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వివరాలను విద్యుత్ సిబ్బంది అడగరని స్పష్టం చేశారు. బిల్లు చెల్లించిన రసీదు మాత్రమే అడుగుతారని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థ బిల్లుల చెల్లింపు కోసం ఎటువంటి వెబ్సైట్ లింకులు మెసేజ్ ద్వారా పంపదని కూడా వివరించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుల పేరుతో ఎవరైనా బ్యాంకు అకౌంట్ వివరాలు గానీ.. లింకులు గానీ మెసేజ్ల ద్వారా పంపిస్తే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని రఘుమా రెడ్డి పేర్కొన్నారు.