ఆంధ్రప్రదేశ్‌లో సమీకృత, సమతుల్య అభివృద్ధి వ్యూహాలపై రాష్ట్రప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ అమరావతిలో రాజధాని ఏర్పాటు సరికాదని నివేదిక ఇచ్చింది. ప్రాంతాల వారీగా ప్రజల ఆకాంక్షలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అంశాలను బేరీజు వేసిన బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూప్ నివేదిక రూపొందించింది. అమరావతి స్థానంలో విశాఖను అభివృద్ధి చేయాలని సూచించింది. విజయవాడ, విశాఖల్లో సచివాలయం, శాసనసభ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రెండు ప్రతిపాదనల్ని సిద్ధం చేశామన్న బీసీజీ.. ఆర్థిక వనరుల్ని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించింది. సచివాలయం విశాఖలో, శాసనసభ అమరావతిలో , హైకోర్టును కర్నూలులో ఏర్పాటుచేయాలని స్పష్టం చేసింది.
13 జిల్లాలను.. 6 ప్రాంతాలుగా విభజన
అన్ని జిల్లాల్లో సమతుల్య అభివృద్ధికి అనుగుణంగా... 13 జిల్లాలను 6 ప్రాంతాలుగా విభజించి నివేదిక ఇచ్చారని ప్రణాళిక సంస్థ కార్యదర్శి విజయకుమార్ స్పష్టం చేశారు. జీఎస్డీపీ, ఎకానమీ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు ఇలా అన్ని అంశాలను బీసీజీ పరిగణలోకి తీసుకుందని తెలిపారు. చాలా అంశాల్లో రాష్ట్రం వెనుకంజలో ఉందని .. వ్యవసాయం మినహా ఏవి సంతృప్తికరంగా లేవని నివేదిక పేర్కొందని ఆయన తెలిపారు.
మూడు రాజధానులు మంచిదే..!
పాలన వికేంద్రీకరణను అనుసరిస్తే మంచిదని బీసీజీ నివేదికలో పేర్కొంది. ఈ విషయంలో చారిత్రక నేపథ్యాన్ని బీసీజీ పరిగణనలోకి తీసుకుంది. మూడు రాజధానులు ఇతర ప్రాంతాల్లో విజయం సాధించిన పరిస్థితులు పరిశీలించింది. కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతంల్లోనూ హైకోర్టు, సచివాలయాలు వేర్వేరుగా ఉన్నాయని తెలిపింది. నగరాలు ఎక్కువ జనాభాతో నిండి పోకూడదని బీసీజీ సూచించింది. వివిధ విభాగాల మధ్య సమన్వయం, ఖర్చు తగ్గించటం, సులువుగా రవాణా, ప్రాంతీయ ఆకాంక్షలు పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇచ్చామని కమిటీ తెలిపింది. మూడు ప్రాంతాల్లోని జనాభా, మౌలిక సదుపాయాలు గమనించి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు కడప, తిరుపతి నుంచి పరిగణనలోకి తీసుకున్నారని విజయ్‌కుమార్ అన్నారు.