తెలంగాణ పూల పండుగ బతుకమ్మ గొప్పతనాన్ని విశ్వ వేదికపై చాటేందుకు రంగం సిద్దమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నేడు దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ(Bathukamma on burj Khalifa)ను ప్రదర్శించనున్నారు. బతుకమ్మ వీడియోను ప్రదర్శించబోయే తెర ప్రపంచంలోనే అతి పెద్దది కావటం గమనార్హం.
రాత్రి 9 గంటల 40 నిమిషాలకు.. మళ్లీ 10 గంటల 40 నిమిషాలకు రెండు సార్లు బుర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ వీడియో ప్రదర్శిస్తారు. మూడు నిమిషాల నిడివి గల వీడియోలో.. తెలంగాణ బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతిని తెలియజేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని కూడా మొత్తం సౌధంపై ప్రదర్శిస్తారు.