హైదరాబాద్ ట్యాంక్‌బండ్ అందాలను చూసేందుకు ప్రభుత్వం... ప్రతి ఆదివారం సాయంత్రం కేవలం నడక దారినే ట్యాండ్ బండ్‌పైకి అనుమతిస్తోంది. నడకదారిన వచ్చే సందర్శకులు, పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్యాంక్‌బండ్ పైకి వచ్చే ట్రాఫిక్‌ను దారి మళ్లీంచారు. ట్యాంక్ బండ్‌పై ప్రతి వారం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా.. ఇవాళ ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహిళలు, యువతులు పెద్దఎత్తున పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడారు. ఐదోరోజు సందర్భంగా అట్లబతుకమ్మ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రంగుల రంగుల బతుకమ్మల చుట్టూ.. ఉయ్యాల పాటలతో ఉత్సాహంగా ఆటలు ఆడుకున్నారు. సెలవుదినాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన వాళ్లు కూడా బతుకమ్మ సంబురాల్లో పాల్గొని సంబురపడ్డారు. ప్రత్యేక వేషాదారణలో యువతుల కోలాట నృత్యాలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా.. ఎంతో సందడిగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.