దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా.. మాస్క్‌లు ధరించటం తప్పనిసరి అయింది. అవి లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కొన్ని చోట్ల జరిమానాల మోత మోగుతోంది. అయినప్పటికీ.. కొందరు అలసత్వం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మాస్క్‌ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు కేరళ పోలీసులు. అదే 'బాస్క్ ఇన్ ద మాస్క్'.
'బాస్క్ ఇన్ ద మాస్క్' భాగంగా 'ఫ్యామిలీ ఫొటో ఛాలెంజ్'ను తెరపైకి తీసుకొచ్చారు కేరళ పోలీసులు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులందరితో కలిసి ఫొటో దిగాలి. ఆ చిత్రాన్ని.. కేరళ పోలీసు విభాగానికి పంపిస్తే సోషల్ మీడియాల్లో తమ అధికారిక ఖాతాల్లో అప్లోడ్ చేస్తారు.
ప్రత్యేక బహుమతులు...
ఫొటోలు పంపేవారు మాస్కులు ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూడాలంటున్నారు పోలీసులు. వేర్వేరు విభాగాల్లో అవార్డులూ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.