తెలంగాణ

telangana

ETV Bharat / city

కోట్లు కురిపించిన బార్లు.. తొలి దశలో ప్రభుత్వానికి రూ.258 కోట్ల ఆదాయం

ఏపీలో కొత్త బార్లు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. తొలిదశలో 14 జిల్లాల పరిధిలో 344 బార్లకు శనివారం ఈ-వేలం నిర్వహించగా 323 బార్లకు లైసెన్సులు ఖరారయ్యాయి. వీటిద్వారా ప్రభుత్వానికి 258 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తం 41 బార్లను కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి వేలంలో పాడారు. వీటిలో 27 బార్లు కోటిన్నర కన్న ఎక్కువ పలికాయి. దీంతో బార్లలో కూర్చొని మద్యం తాగాలనుకునే వారిపై వీరబాడుదు తప్పేలా లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

bar
bar

By

Published : Jul 31, 2022, 10:55 AM IST

ఆంధ్రప్రదేశ్​లో అత్యధికంగా కడపలో బార్‌ కోసం కోటి 83 లక్షల90 వేల రూపాయలు కోట్‌ చేసి వైకాపా నాయకుడు ఒకరు లైసెన్సు దక్కించుకున్నారు. ఇదే నగరంలో ఓ వ్యాపారి కోటి 81 లక్షల 90 వేలకు వేలం పాడుకున్నారు. కడపలో మొత్తం 12 బార్లకు వేలం నిర్వహించగా అవన్నీ కోటి 55 లక్షల కన్నా ఎక్కువకే పలికాయి. ఈ బార్లన్నీ వైకాపా నాయకులే దక్కించుకున్నారు. కడపలో బారు లైసెన్సు రుసుము ఇప్పటివరకూ 35 లక్షల రూపాయలు ఉండేది. ఇప్పుడు మాత్రం బార్‌ను గరిష్ఠంగా కోటి 83 లక్షల90 వేల రూపాయలకు వేలం పాడి దక్కించుకున్నారు. అంటే ప్రస్తుతమున్న లైసెన్సు ధరపై దాదాపు అయిదున్నర రెట్లు అధిక మొత్తానికి వేలం పాడారు.

ఆ సొమ్ము తిరిగి రాబట్టుకోవాలంటే ఆ భారమంతా మందుబాబులపైనే వేస్తారు. అనంతపురంలో కోటి 66 లక్షలకు, తిరుపతిలో కోటి 59 లక్షలకు, నాయుడుపేటలో కోటి 35లక్షలకు అత్యధిక మొత్తాల్లో వేలం పాడి పలువురు బార్‌ లైసెన్సులు దక్కించుకున్నారు. ఏపీలో అత్యధిక బార్లు అధికార వైకాపా నాయకులే దక్కించుకున్నారు. అంతంత భారీ మొత్తాలకు బార్లు దక్కించుకున్నవారు ఆ మొత్తాల్ని తిరిగి రాబట్టుకోవటంతో పాటు పెట్టిన పెట్టుబడిపై లాభాలు ఆర్జించడానికి అడ్డూఅదుపూ లేకుండా మద్యం ధరలు పెంచి విక్రయిస్తారు. ఫలితంగా బారులలో మద్యం ధరలు పేలిపోనున్నాయి. కూర్చొని మద్యం తాగాలనుకునేవారిపై పెను భారం పడుతుంది. అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుంది.

బార్ల ఈ-వేలానికి సంబంధించి ఆయా నగరాల జనాభాను బట్టి 50 లక్షలు, 35 లక్షలు, 15 లక్షల్ని అప్‌సెట్‌ ధరగా ఖరారు చేశారు. 35 లక్షలు అప్‌సెట్‌ ధరగా నిర్ణయించిన కొన్ని పట్టణాలు, నగరాల్లో బార్లు వేలంలో కోటిన్నరకు పైగా ధర పలికాయి. ఈ-వేలానికి రాయలసీమ జిల్లాల్లో భారీగా పోటీ నెలకొనగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం పెద్దగా పోటీ లేదు. కడప, తిరుపతి, అనంతపురం నగరాల్లో అప్‌సెట్‌ ధర 35 లక్షలు కాగా.... నాయుడుపేటలో అప్‌సెట్‌ ధర 15 లక్షలు. వేలంలో పాల్గొన్నవారు ఆ ధరపై 2 లక్షల చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. ఇక్కడ బార్లను కోటి కంటే ఎక్కువ మొత్తాలకు కోట్‌ చేసి వ్యాపారులు లైసెన్సులు దక్కించుకున్నారు. ఆయా నగరాల్లో బార్‌లలో రేట్లు పేలిపోనున్నాయి.

విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి నగరాల్లో మాత్రం వ్యాపారులు ముందే అవగాహన కుదుర్చుకుని వేలంలో పెద్దగా పోటీ లేకుండా చూసుకుని తక్కువ మొత్తాలకు దక్కించుకున్నారు. విశాఖపట్నంలో అప్‌సెట్‌ ధర 50 లక్షలుగా ఖరారు చేసినా గరిష్ఠంగా 60 లక్షలే పలికింది. శ్రీకాకుళంలోనే అపెస్‌ట్‌ ధర 35 లక్షలకు కేవలం 2 లక్షలు పెంచి కోట్‌ చేశారు. విశాఖ నగరంలో మొత్తం 128 బార్లకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. 119 బార్‌లకు మాత్రమే పోటీ నెలకొంది. అన్నమయ్య, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ ప్రాంతాలన్నింటిలోనూ వ్యాపారులు ముందే అవగాహన కుదర్చుకుని ఎక్కువ మొత్తాలకు కోట్‌ చేయకుండా ఉన్నారు. వీటిలో ఎక్కువ చోట్ల అధికార పార్టీ నాయకుల ప్రమేయమే ఉంది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని మొత్తం 344 బార్లకు ఈ వేలం నిర్వహించగా... 21 బార్‌లకు ఖరారు కాలేదు. విశాఖపట్నంలో 8, నర్సీపట్నం, అనకాపల్లి, హిందూపురంలో రెండేసి చొప్పున, పలాస, డోన్, మడకశిర, పుంగనూరు, పలమనేరు, రాయదుర్గం, అమటంరావివలస పర్యాటక బార్‌కు లైసెన్సులు ఖరారు కాలేదు. వీటికి మళ్లీ వేలం నిర్వహించనున్నారు.

అలిపిరి నుంచి 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధించాలని 2019 అక్టోబరు 23న తితిదే ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది దీన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఒక వేళ ఒకేసారి అమలు చేయకుంటే దశల వారీగా చేపట్టాలని... తొలి దశలో తిరుపతి ప్రధాన రహదారులకు ఆనుకుని 2 కిలోమీటర్ల పరిధిలో దీన్ని అమలు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండు నుంచి అలిపిరి, చెర్లోపల్లి నుంచి అలిపిరి, టౌన్‌ క్లబ్‌ నుంచి అలిపిరి..ఇలా ఈ మూడు రహదారుల్లోనైనా తొలుత నిషేధాన్ని విధించాలని కోరారు. మద్యం నిషేధం మాట ఎలా ఉన్నా తిరుపతిలో ఏరులైపారుతోంది. తితిదే తిరుపతి పరిధిలో మద్యం దుకాణాలను పూర్తిగా నిషేధించాలని కోరుతుంటే ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా బార్‌ దుకాణాలకు లైసెన్సులు జారీ చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details