Interest on Dalit Bandhu Funds : రాష్ట్రంలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరయ్యే వరకు ప్రత్యేక ఖాతాల్లోని నగదుపై వడ్డీ జమ కానుంది. లబ్ధిదారుల పేరిట ఖాతాల్లో నిధులు ఉన్నందున ఆ వడ్డీపై పూర్తి హక్కులు వారికే లభించనున్నాయి. మూడు నెలల క్రితం నిధులు జమ చేసినందున ఒక్కో లబ్ధిదారుకు కనీసం రూ.8-9వేల వరకు వడ్డీరూపంలో అందుతాయని సంక్షేమవర్గాలు బావిస్తున్నాయి.
Dalit Bandhu Scheme : ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షలతో స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం దళిత బంధు ప్రారంభించింది. ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో పథకం ప్రారంభమైంది. హుజూరాబాద్ పరిధిలో దాదాపు 20వేల మంది వరకు లబ్ధిదారులు ఉంటారని అంచనా వేసింది. వీరిలో ఇప్పటికే 18వేల మందికి రూ.10లక్షల చొప్పున రూ.1800 కోట్లు జమ చేసింది. వాసాలమర్రిలో 76 మంది ఉంటారని అంచనా వేసినా, ఇప్పటికే 66 ఖాతాల్లో నగదు వేసింది. బ్యాంకుల్లో లబ్ధిదారుల పేరిట ప్రత్యేకంగా దళితబంధు ఖాతాలు తెరిచి ఈ నిధులు జమచేసింది.