ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పింఛనుదారులకు పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 300(ఏ) చట్టం.. సకాలంలో ఉద్యోగులు, పింఛనుదారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించిందని లేఖలో పేర్కొన్నారు.
Bandi Sanjay Fires on KCR : 'ఎలా ఉన్న రాష్ట్రాన్ని ఎట్ల చేసిండ్రు' - ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడంపై కేసీఆర్‌కు బండి లేఖ
ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు పొందడం వారి రాజ్యాంగపు హక్కు అని స్పష్టం చేశారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తే తప్పు వేతనాల చెల్లింపులో ఆలస్యం చేయకూడదని చెప్పారు.
రాష్ట్రప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వారి జీవించే హక్కును కాలరాయడమేనని సంజయ్ మండిపడ్డారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 360 ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప ఉద్యోగుల, పెన్షన్‌దారుల చెల్లింపులు ఆలస్యం చేయకూడదని అన్నారు. ఇవే కాకుండా.. ఇతర అత్యవసర బిల్లులు కూడా ప్రభుత్వం పెండింగ్‌లో పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ రియంబర్స్‌మెంట్, సరెండర్ లీవ్, జీపీఎఫ్, అడ్వాన్స్‌లు, పార్ట్ ఫైనల్ విత్‌డ్రాయల్... ఇలా అన్ని బిల్లులు నెలల తరబడి పెండింగులో ఉంటున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం తెరాస అసమర్థ పాలనకు నిలువుటద్దం అని బండి సంజయ్ విరుచుకుపడ్డారు. 2014లో 16వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు అప్పులపాలు చేశారని ఆరోపించారు. ఉద్యోగులు, పెన్షన్‌దారులు ప్రతినెల 15వ తారీఖు వరకు జీతాల కోసం ఎదురుచూసే దౌర్భాగ్యస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టిన ఘనత కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు.