లాక్డౌన్ సమయంలో బాధితులకు జరగాల్సిన వైద్య సేవలు, ప్రయాణాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తాము పూర్తి మద్దతిస్తామని ముందుగానే ప్రకటించినట్లు వెల్లడించారు. లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించిందన్నారు. ఇప్పటికే తెలంగాణ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించినట్టు వివరించారు. మొత్తానికి ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి మంచి పని చేసిందన్నారు.
'మొత్తానికి ఆలస్యంగానైనా లాక్డౌన్ పెట్టారు.. సంతోషం'
ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించటాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతించారు. లాక్డౌన్ సమయంలో కరోనా బాధితులకు సంబంధించిన ఏ వైద్య సేవలకూ ఆటకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ... నిరుపేదల ఆకలి తీర్చటంలో ముందుండాలని కార్యకర్తలకు బండి సూచించారు.
లాక్డౌన్ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని బండి సూచించారు. రాష్ట్రానికి అవసరమున్నంత ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపించిందన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని కోరారు. కరోనా చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలన్నారు.
గతేడాది మొదటి లాక్డౌన్లో లాగానే భాజపా కార్యకర్తలు నిబంధనలను పాటిస్తూ... ఆకలితో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఆహారాన్ని అందించాలని సూచించారు. తమ బూత్ ఏరియాలోని నిరుపేదలకు అవసరమైన సాయం చేయాలని బండి సంజయ్ కోరారు.