తెలంగాణ

telangana

ETV Bharat / city

'పోడు రైతులకు రెవెన్యూ సదస్సుల్లో హక్కు పత్రాలు ఇవ్వాలి..' - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

Bandi Sanjay Letter to CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. రెవెన్యూ సదస్సుల్లో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యేవరకు అటవీ, పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులు జోక్యం చేసుకోకూడదని కోరారు.

Bandi Sanjay Letter to CM KCR Podu lands in telangana
Bandi Sanjay Letter to CM KCR Podu lands in telangana

By

Published : Jul 8, 2022, 2:36 PM IST

Bandi Sanjay Letter to CM KCR: రెవెన్యూ సదస్సుల్లో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. పోడుభూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా తీసుకుని వచ్చి గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని 2019 జులైలో కేసీఆర్‌ ఇచ్చిన హామీని బహిరంగ లేఖలో గుర్తు చేశారు. 2018 నవంబర్‌ 23న మహబూబాబాద్‌ బహిరంగసభలో అవసరమైతే కుర్చీవేసుకుని మరీ పోడురైతులకు పట్టాలు అందజేస్తామని కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని బహిరంగలేఖలో ప్రస్తావించారు.

కుర్చీవేసుకుని గిరిజనులకు, ఆదివాసీలకు పట్టాలు ఇప్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధమైతే.. భాజపా తెలంగాణ శాఖ, గిరిజనులు, ఆదివాసీలు కుర్చీలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. కుర్చీవేసుకుని పట్టాలు ఇప్పించకపోయినా ఫర్వాలేదు కానీ.. కనీసం జులై 15 నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో పోడురైతులకు హక్కుపత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటే అదే పదివేలని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం పోడుభూములు సాగుదారుల నుంచి ఎన్ని లక్షల ఎకరాలపై, ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో.. జిల్లాలు, మండలాలు, గ్రామాలవారీగా జాబితాను రెవెన్యూ సదస్సుల కన్నా ముందే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యేవరకు అటవీ, పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులు జోక్యం చేసుకోకూడదని.. దాడులు నిలిపివేయాలని సంజయ్​ కోరారు. పోడుభూముల సమస్యపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహిరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య కేవలం రెవెన్యూ శాఖకే పరిమితమైంది కాదని.. అటవీ శాఖతో కూడా ముడిపడి ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సదస్సులో అటవీ శాఖను కూడా భాగస్వామ్యం చేయాలని సీఎంను బండి సంజయ్​ కోరారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details