వెదురుకంద అనగానే ఇదేదో మైదాన ప్రాంతాల్లో దొరికే కందలాంటిది అనుకునేరు. కాదండోయ్!చినుకుకాలంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన గిరిజన ఆహారమే ఈ వెదురుకంద. వెదురు కలపగానే ఎక్కువ మందికి తెలుసు. కానీ లేత వెదురుతో నోరూరించే కూరను సైతం తయారు చేయవచ్చు. అది కూడా ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే! గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వెదురు సాగు ఉంటుంది. వాటి నుంచి తీసిన సహజ సిద్దమైన ఆహార పదార్థమే ఈ వెదురు కంద. ఏటా జూన్ నుంచి ఆగస్టు వరకు వెదురు కంద తీస్తుంటారు. ఈ మూడు నెలల్లో పడిన వర్షాలకు వెదురు మొక్క చిగురిస్తుంది. దాని నుంచి పొట్ట (కంద భాగం) బయటకు వస్తుంది. ఈ పొట్ట భాగాన్ని తొలగిస్తారు. తొలగించిన పొట్టను శుభ్రం చేసి ముక్కలుగా కూరకు అనుకూలంగా తరుగుతారు. ఇది ఎటువంటి ఎరువులు, పురుగు మందుల ప్రభావం లేని సహజ సిద్ధ్దమైన ఆహారం.
చేదుగా ఉండే వెదురు తరుగుని బాగా మెత్తగా ఉడకబెట్టి.. నీరు వార్చేయటం ద్వారా అందులో వగరు తగ్గిపోతోంది. అప్పుడు గిరిజనులు దానిని ఇగురుగా, కూరగా చేసుకుని తింటారు. వెదురు గడ్డను ఉడకబెట్టి వార్చిన నీరు కూడా అత్యంత రుచికరంగా ఉంటుందంటున్నారు.. గిరిజనులు. దానిని చారులా తయారు చేసుకుంటామని చెబుతున్నారు.