Sundara Naidu Passed Away: బాలాజీ హేచరీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. పశు వైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన.. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి అపార కృషి చేశారు. ఉమ్మడి ఏపీలో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. చిత్తూరులో బాలాజీ హేచరీస్ స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఔత్సాహికులకు దార్శనికుడిగా నిలిచారు.
ఉప్పలపాటి సుందరనాయుడు 1936 జులై 1న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కంపలపల్లెలో జన్మించారు. నాన్న గోవిందునాయుడు, అమ్మ మంగమ్మలకు సుందరనాయుడుతో కలిపి మొత్తం ఐదుగురు సంతానం. అందరూ కలసి జీవించే ఉమ్మడి కుటుంబం వీరిది. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుందరనాయుడు టి.పుత్తూరు పాఠశాలలో ప్రాథమిక విద్య, అరగొండ జడ్పీ హైస్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్య, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత బొంబాయి వెటర్నరీ యూనివర్సిటీలో బీవీఎస్సీ పూర్తి చేశారు. చదువులో చురుగ్గా ఉండే సుందరనాయుడు.. తన గ్రామంలోని యువతను చైతన్య పరచడానికి నేతాజీ బాలానంద సంఘాన్ని స్థాపించి, గ్రంథాలయాన్ని, క్రీడా పరికరాలను సమకూర్చారు. గ్రామస్థుల సహకారంతో సంఘానికి శాశ్వత భవనాన్ని నిర్మించారు. విద్యార్థి దశ నుంచే సమాజ సేవా దృక్పథం, సమైక్య భావన సుందరనాయుడికి అలవడింది.
పశువైద్యుడిగా జీవితం ప్రారంభించి:బీవీఎస్సీ పూర్తయిన తర్వాత కొంతకాలం చిత్తూరు జిల్లా పీలేరులో పశు వైద్యుడిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేశారు. 1964 డిసెంబర్ 9న సుందరనాయుడికి పెమ్మసాని సుజీవనతో వివాహం జరిగింది. అనంతరం చిత్తూరు, అనంతపురం, కృష్ణగిరి(తమిళనాడు)జిల్లాల్లో పశు వైద్యుడిగా విశేష సేవలందించారు. ఈ క్రమంలోనే అక్కడి రైతులకు దగ్గరయ్యారు. రైతుల జీవితాలను దగ్గరి నుంచి చూసిన ఆయనకు పెద్ద సమస్యే కనిపించింది. పంటలు పండక, పండినా గిట్టుబాటు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశారు. వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం ఉంటే రైతుల సమస్యలు తగ్గుతాయని భావించారు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే కోళ్ల పెంపకం.