తెలంగాణ

telangana

ETV Bharat / city

Badvel By-Poll: బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు బద్వేలు గురుకుల పాఠశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నాలుగు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నామన్న ఆర్వో.. పది రౌండ్లలో ఫలితాలు పూర్తవుతాయని వెల్లడించారు.

Badvel By-Poll
Badvel By-Poll

By

Published : Nov 2, 2021, 12:34 AM IST

ఏపీలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. నియోజకవర్గం 7 మండలాల్లోని 281 కేంద్రాల్లో అక్టోబరు 30న పోలింగ్ జరగ్గా.. 68.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. మెుత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ప్రధానంగా వైకాపా, భాజపా, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. వైకాపా నుంచి దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ సుధ, భాజపా నుంచి పనతల సురేశ్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీలో ఉన్నారు.

కౌంటింగ్ కోసం బద్వేలు ఏపీ గురుకుల పాఠశాలలో నాలుగు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో 7 టేబుళ్ల చొప్పున మొత్తం 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా సిబ్బంది, ఏజెంట్లకు మధ్య బారికేడ్లు, కంచె ఏర్పాటు చేశారు. కౌంటింగ్​లో భాగంగా ముందుగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను అభ్యర్థుల తరఫు ఏజెంట్ల సమక్షంలో తెరిచి కౌంటింగ్ కేంద్రానికి తీసుకొస్తారు.

ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్లు లెక్కిస్తారు. 235 వరకు పోస్టల్, సర్వీసు ఓట్లు వచ్చినట్లు ఆర్వో తెలిపారు. ఈవీఎంల ద్వారా లెక్కించే ఫలితాలు మధ్యాహ్నానికి పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. పది రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయని ఆర్వో కేతన్ గార్గ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో ర్యాండమ్ చెకింగ్ కోసం ఒక వీవీ ప్యాట్​ను ప్రతి గదిలో అందుబాటులో ఉంచామన్నారు. కౌంటింగ్ కేంద్రంలో సూపర్ వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు అందుబాటులో ఉంటారని తెలిపారు.

కౌంటింగ్​కు ఏడు రోజుల ముందుగానే రాజకీయ పార్టీలకు ఏజెంట్ల కోసం నోటీసులు పంపినట్లు ఆర్వో వెల్లడించారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తామని ఆర్వో స్పష్టం చేశారు. ఉపఎన్నిక ఓట్లలెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్ద బారికేడ్లు ఏర్పాటుచేశారు. విజయోత్సవ సంబరాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

బద్వేలు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ఇదీ చదవండి:Huzurabad Counting: ఆ వీవీప్యాట్​కు పోలింగ్​తో సంబంధం లేదు.. విజయోత్సవ ర్యాలీలకు నో...

ABOUT THE AUTHOR

...view details