పది రోజులపాటు సమావేశాలు.. 18న బడ్జెట్ బడ్జెట్ సమావేశాల ఎజెండా ఖరారు చేసేందుకు గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశమైంది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీకి.. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీత, కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, మజ్లిస్ శాసనసభ్యుడు పాషా ఖాద్రీ పాల్గొన్నారు.
పది రోజుల పాటు సమావేశాలు..
బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండాపై సమావేశంలో చర్చించారు. ఈ నెల 26వ తేదీ వరకు పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. నోముల నర్సింహయ్య సహా దివంగత సభ్యులకు మంగళవారం శాసనసభ సంతాపం తెలపనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ముఖ్యమంత్రి సమాధానం ఈ నెల 17న ఉంటుంది.
రోజువారీ కార్యక్రమాలు..
2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను 18న ప్రవేశపెడతారు. 19వ తేదీన సెలవు కాగా 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ.. ప్రభుత్వ సమాధానం ఉంటుంది. 23, 24, 25న బడ్జెట్ పద్దులపై చర్చ చేపడతారు. ఈ నెల 26న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ప్రభుత్వ సమాధానం ఉంటుంది. 20న తేదీ నుంచి ప్రతిరోజూ ప్రశ్నోత్తరాలు, శూన్యగంట చేపట్టాలని బీఏసీలో నిర్ణయించారు.
భట్టి ఏమన్నారంటే..
వ్యవసాయ చట్టాలపై సభలో చర్చించి తీర్మానం చేయాలన్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. న్యాయవాద దంపతుల హత్య, పెట్రోల్-డీజిల్ ధరల పెంపు, రాయలసీమ ఎత్తిపోతలతో కలిగే నష్టాలు, మిషన్ భగీరథపై చర్చించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 25 రోజుల పాటు.. బడ్జెట్‌పై చర్చ జరిగేది, ఇప్పుడు సభ పనిదినాలను కుదిస్తే ఎలా అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
పనిదినాలు పెంచడం సాధ్యం కాదు..
అన్ని అంశాలపై పూర్తిగా చర్చకు సిద్దమన్న ప్రభుత్వం... బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఏ అంశాన్నైనా లేవనెత్తవచ్చని తెలిపింది. మార్చి 31 వరకు బడ్జెట్ ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో పనిదినాలు పెంచడం సాధ్యం కాదని పనిదినాల్లో ఎన్ని గంటలైనా చర్చించేందుకు సిద్ధమని సర్కారు స్పష్టం చేసింది.
ఐదు రోజులపాటు మండలి సమావేశాలు..
శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. కౌన్సిల్ ఆవరణలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ బీఏసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి, 18న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 20న ప్రశ్నోత్తరాలతో పాటు బడ్జెట్‌పై సాధారణ చర్చ, 22న బడ్జెట్‌పై చర్చ, 26న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో సమావేశాలు ముగియనున్నాయి.
ఇవీచూడండి:ప్రజల పురోగతికి కట్టుబడి.. దేశానికే ఆదర్శంగా నిలిచాం: గవర్నర్