తెలంగాణ

telangana

ETV Bharat / city

Azadi Ka Amrit Mahotsav: గుంటూరు... ఆయన జాగీరైందా? - Azadi Ka Amrit Mahotsav story

Azadi Ka Amrit Mahotsav : సైమన్‌ కమిషన్‌ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ 1928 ఫిబ్రవరి 23న గుంటూరుకు వచ్చింది. నాటి మున్సిపల్‌ ఛైర్మన్‌ పిలుపుతో... పట్టణ ప్రజలు హర్తాళ్‌ పాటించారు. ఇళ్లలో నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా బయటికి రాలేదు. పౌర జీవనం స్తంభించింది. నిర్మానుష్య వీధులను చూసి నాటి కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ‘గుంటూరులో బ్రిటిష్‌ రాజ్యం ఎక్కడుంది? చూస్తుంటే ఈ జిల్లా యావత్తు ఎన్‌వీఎల్‌ జాగీరుగా మారినట్లు కనిపిస్తోంది’ అని మండిపడ్డారు. కలెక్టర్‌ ఆగ్రహానికి కారకులైన ఎన్‌వీఎల్‌... పూర్తి పేరు నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు.

Azad ka Amrit mahotsav
Azad ka Amrit mahotsav

By

Published : Apr 26, 2022, 9:57 AM IST

Azadi Ka Amrit Mahotsav : గుంటూరులో రామయ్య, లక్ష్మమ్మ దంపతులకు నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు 1890 జనవరి 1న జన్మించారు. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో డిగ్రీ చదివారు. తర్వాత ఇంగ్లండ్‌లోని ఎడిన్‌బరోలో ఎం.ఎ. ఎకనమిక్స్‌(ఆనర్స్‌), లింకన్స్‌ ఇన్‌లో న్యాయశాస్త్రం(1915) అభ్యసించారు. మద్రాసులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద జూనియర్‌ లాయర్‌గా పనిచేశారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, దేశభక్త కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, మహర్షి బులుసు సాంబమూర్తి వంటి మహామహులతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

‘వందేమాతరం’తో అడుగులు:బిపిన్‌చంద్రపాల్‌ 1907లో గుంటూరుకు వచ్చి, విద్యార్థులకు వందేమాతరం మంత్రాన్ని ఉపదేశించారు. అప్పట్లో అమెరికన్‌ ఇవాంజికల్‌ లూథరన్‌ మిషన్‌(ఏఈఎల్‌ఎమ్‌) కళాశాలలో చదువుతున్న నడింపల్లి నరసింహారావు... తన తోటి విద్యార్థులతో కలిసి ఒకరోజు ప్రార్థన సమయంలో ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. ఆగ్రహించిన ప్రిన్సిపల్‌ రుగ్వేదంలోని ‘వందే భగవంతమ్‌’ మంత్రాన్ని ఉచ్చరించాలని ఆదేశించగా అంతా నిరాకరించారు. సాయంత్రం 5 గంటల వరకు కళాశాల తలుపులు మూసేసినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. విసుగు చెందిన ప్రిన్సిపల్‌ గేట్లు తెరవగా... అప్పుడూ వందేమాతరం నినాదం చేసుకుంటూనే వెళ్లిపోయారు.

మద్రాసులో ఉండగా అనీబిసెంట్‌ హోంరూల్‌ ఉద్యమంలో ఎన్‌వీఎల్‌ పాల్గొన్నారు. కార్మికులను సంఘటితం చేయడానికి నియోఫాబియన్‌ సొసైటీని స్థాపించారు.

రూథర్‌ఫర్డ్‌తో ఢీ అంటే ఢీ:సహాయ నిరాకరణ ఉద్యమం సాగుతున్న తీరును పరిశీలించడానికి గుంటూరుకు 1922 ఆగస్టు 1న మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షతన కమిటీ వచ్చింది. ఆయనకు సన్మానం చేయాలని, స్వాగత పత్రం చదవాలని మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేయగా... కలెక్టర్‌ రూథర్‌ఫర్డ్‌ (మన్యంలో అల్లూరిని హత్య చేయించిన ఆంగ్ల అధికారి) వీటో చేశారు. అప్పటి మున్సిపల్‌ ఛైర్మన్‌, ఉప ఛైర్మన్‌ భయంతో కమిటీకి స్వాగతం పలకడానికి కూడా రాలేదు. నాడు ధైర్యంగా ముందుకు వచ్చిన ఎన్‌వీఎల్‌ను... మోతీలాల్‌ మెచ్చుకుని, కలెక్టర్‌ ఆదేశాలను వీటో చేస్తున్నానని, నడింపల్లి నరసింహారావును మున్సిపల్‌ ఛైర్మన్‌గా నియమిస్తున్నానని, మీకు అంగీకారమేనా? అని ప్రశ్నించగా... ప్రజలు జేజేలు పలికారు. అదే ఏడాది ఎన్‌వీఎల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ అయ్యారు. వెంటనే దక్షిణ భారతంలోనే తొలిసారిగా... తమ మున్సిపల్‌ కార్యాలయం భవనంపై ఆంగ్లేయుల జెండాను దించేసి, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సంచలనం సృష్టించారు.

2 వేల మందితో ఉప్పు సత్యాగ్రహం:శాసన ఉల్లంఘనలో భాగంగా గాంధీజీ 1930లో ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. అప్పుడు నడింపల్లి నరసింహారావు పిలుపుతో పట్టణంలో చందాలుగా రూ.30 వేలు వసూలయ్యాయి. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి రెండు వేల మంది కార్యకర్తలను గుంటూరుకు రప్పించారు. వారు సముద్రం నుంచి తీసుకొచ్చిన ఉప్పునీటితో గుంటూరులోని కొండా వెంకటప్పయ్య ఇంటి ఆవరణలో ఉప్పు తయారు చేయించారు. తీవ్రంగా ఆగ్రహంచిన కలెక్టర్‌... నడింపల్లిని అరెస్టు చేయించి, బళ్లారి జైలుకు పంపించారు. అక్కడి నుంచి తిరుచిరాపల్లికి తరలించారు. జైలు నుంచి విడుదలైన రోజున నడింపల్లికి గుంటూరు పురజనులు ఘనస్వాగతం పలికారు.

మున్సిపల్‌ ఛైర్మన్‌గా సేవలు:స్వాతంత్య్రోద్యమంలో నడింపల్లి ఎప్పుడూ దూకుడు ప్రదర్శించారు. అందుకే ఆయన్ని ప్రకాశం పంతులు గుంటూరు కేసరి అని ప్రేమగా పిలిచేవారు. నడింపల్లి గుంటూరు పురపాలక సంఘం ఛైర్మన్‌గా స్వాతంత్య్రం రాకముందు 11 ఏళ్లు, వచ్చాక రెండు నెలలు పనిచేశారు. ఆయన హయాంలోనే గాంధీపార్కు సమకూరింది. పట్టణంలో ప్రతినెలా ‘ఆరోగ్య వారం’ నిర్వహించేవారు. మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్‌ వేరుపడ్డప్పుడు తొలి శాసనసభలో ప్రొటెం స్పీకర్‌గా నడింపల్లి వ్యవహరించారు. జీవితాంతం ప్రజల వెంట నడిచిన ఆయన 1978 జనవరి 16న పరమపదించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details