అయేషామీరాపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్యాచారానికి కారకులెవరో తేల్చాలన్న హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగింది సీబీఐ. గతంలో ఆధారాలు ధ్వంసం కావడంతో రీ పోస్టుమార్టం నిర్వహించింది. తొలుత బాధిత కుటుంబం, ముస్లిం మతపెద్దల వ్యతిరేకతతో విజయవాడ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మహిళా కోర్టు నుంచి సీబీఐ అనుమతి పొందింది. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని స్మశానవాటికలో... అయేషామీరా సమాధిని అధికారులకు ఆమె తండ్రి ఇక్బాల్ చూపించారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో ఆ ప్రదేశాన్ని తవ్వారు. శనివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు రీ పోస్ట్‌మార్టం ప్రక్రియ మొదలుపెట్టి... మధ్యాహ్నం 2 గంటల 30నిమిషాలకు ముగించారు. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య నేతృత్వంలో మొత్తం 15మంది అధికారులు పాల్గొన్న పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని చిత్రీకరించారు.
పుర్రె, ఎముకల నమూనాల సేకరణ
అయేషామీరా మృతదేహంపై కేవలం ఒక గాయం గుర్తించినట్లు గతంలో దర్యాప్తు చేసిన పోలీసులు రూపొందించిన ఛార్జిషీట్లో నమోదు చేశారు. అలా కాకుండా ఇంకా గాయాలేమైనా ఉన్నాయా అనే కోణంలో నిపుణులు శనివారం పరిశీలించారు. పుర్రెభాగంలో గాయాలను గుర్తించి సంబంధిత ఎముకలను సేకరించారు. భుజం ఎముక, ఎడం వైపు పక్కటెముక, దవడపళ్లు రెండింటిని సేకరించి... డీఎన్ఏ పరీక్షలకు భద్రపరిచారు. మతాచారాల ప్రకారం మిగతా అస్థిపంజరాన్ని పూడ్చివేశారు. సేకరించిన ఎముకలను ఫోరెన్సిక్ బృందం హైదరాబాద్ పంపింది. మొత్తం ప్రక్రియను చట్టపరంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.