గతంలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ, స్టడీ అవర్స్, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ.. ఇలా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవారు. ఇప్పుడు పూర్తిగా పాఠ్యపుస్తకాలు, నోట్స్‌కే పరిమితం కావాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సబ్జెక్టుల వారీగా సమయాన్ని విభజించుకుని ముఖ్యమైన సూత్రాలు, నియమాలు వంటివి సులువుగా గుర్తుంచుకునే విధానాలపై దృష్టిపెట్టాలి.నాలుగైదుసార్లు చదువుకుంటూ, మళ్లీమళ్లీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ నెమరువేసుకోవాలి.
సానుకూల దృక్ఫథం
సవాళ్లను అవకాశాలుగా మలుచుకునే సత్తా ప్రతిఒక్కరిలో ఉండాలి. సానుకూల దృక్పథం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఒకేరోజులో అన్ని చదివేయొచ్చన్న ఆలోచన సరికాదు. ఫిబ్రవరి లేదా మార్చిలో చదువుకుందామని భావించి వదిలేస్తే, ఒకేసారి చదవాలంటే తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. రోజుకు రెండు లేదా మూడు సబ్జెక్టులు తీసుకుని అందులోని పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదువుతూ పట్టు సాధించాలి. ప్రతి 15 రోజులకోసారి రివిజన్ చేస్తుండాలి.
నమూనా ప్రశ్నపత్రాలు ముఖ్యం
ఈసారి ప్రభుత్వం పరీక్షలను కుదించి ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహించాలని భావిస్తోంది. దీనికి తగ్గట్టుగా ప్రశ్నపత్రం సరళిని తెలుసుకోవాలి. గతంలో వచ్చిన ప్రశ్నలు తెలుసుకుని వాటిపై పట్టు సాధించాలి. ఎప్పటికప్పుడు పాఠం పూర్తయిన వెంటనే గతంలో ప్రశ్నపత్రాల్లో దానికి సంబంధించి ప్రశ్నలు ఏవైనా వచ్చాయో చూసి అధ్యయనం చేయాలి.