తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2021, 6:38 AM IST

ETV Bharat / city

కొవిడ్ టీకా రెండు డోసుల మధ్య ఎంత వ్యవధి ఉండాలి?

రాష్ట్రంలో కొవిడ్‌ టీకా తొలి డోసు పొందిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రెండు డోసుల మధ్య వ్యవధి 4 వారాలు ఎందుకుండాలి? 28వ రోజునే ఎందుకు రెండో డోసు తీసుకోవాలి? పూర్తి రక్షణకు 42 రోజుల సమయం ఎందుకు? తదితర అంశాలపై అవగాహన కల్పించనుంది.

awareness on covid vaccination in telangana
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ 2021

‘యాంటీ బాడీలు తయారయ్యే క్రమంలో అజాగ్రత్త వల్ల కరోనా వైరస్‌ సోకితే... టీకా పొందినా ఉపయోగం ఉండద’ని రాష్ట్ర వైద్యశాఖ తెలిపింది. రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత లబ్ధిదారులకు వైరస్‌ సోకినా.. దాని ప్రభావం తీవ్రంగా ఉండదు. కానీ వీరి ద్వారా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే టీకా పొందిన వారు కూడా.. తప్పనిసరిగా మాస్కు, చేతుల శుభ్రత వంటి జాగ్రత్తలన్నీ పాటించాలని వైద్యశాఖ సూచించింది.

100 శాతం యాంటీబాడీలు వృద్ధి చెందేదిలా..

తొలి డోసు..

* టీకా తొలి డోసు శరీరంలోకి ప్రవేశించగానే శరీరం ప్రతిస్పందిస్తుంది. వెలుపలి నుంచి వచ్చే కొత్త వైరస్‌ను గుర్తించి, ఎదురుదాడికి సిద్ధపడుతుంది.

* ఈ క్రమంలోనే వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి.

* తొలి మూణ్నాలుగు రోజుల్లో శరీర కణాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరిలో జ్వరం, దద్దుర్లు, నొప్పి, తల తిరగడం వంటి స్వల్ప ప్రతిస్పందనలు సహజమే.

జాగ్రత్తలు..

*కలుషిత ఆహారం, కలుషిత నీరు తీసుకుంటే.. వాటి వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. బలవర్ధక, తాజా ఆహారం, శుభ్రమైన తాగునీరు తీసుకోవాలి.

* ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

తొలి డోసు వేసుకున్న దాదాపు 12 రోజులకు 30-40 శాతం, 4 వారాలకు 60-70 శాతం యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి

రెండో డోసు..

100 శాతం యాంటీబాడీలు వృద్ధి చెందకపోతే, పూర్తి రక్షణ లభించదు. తొలిడోసు పొందిన 28వ రోజున తప్పనిసరిగా రెండో డోసు తీసుకోవాలి. ఆ రోజు కుదరకపోయినా, 2, 3 రోజుల తర్వాతైనా రెండో డోసు పొందాలి.

ఆ తర్వాత 14 రోజులకు పూర్తిస్థాయిలో రక్షణ వ్యవస్థ సంసిద్ధమవుతుంది.

  • ఇదీ చూడండి : 'కొవిడ్‌ టీకాల పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డు'

ABOUT THE AUTHOR

...view details