తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆకాశమే హద్దుగా దూసుకుపోవాలని ఉందా...! - aviation courses

ఆకాశంలో దూసుకుపోయే విమానం అనగానే చిన్నా పెద్దా తేడా లేకుండా ఆసక్తి వచ్చేస్తుంది. దేశం దాటి విదేశం చేరాలంటే గగనమార్గమే ప్రధాన రవాణా మార్గం. ఇప్పుడు దేశీయంగానూ త్వరగా గమ్యాన్ని చేరడానికి చాలామంది దీనికే మొగ్గు చూపుతున్నారు. కెరియర్‌పరంగానూ ఏవియేషన్‌ (వైమానిక రంగం) ఎన్నో అవకాశాలను అందిస్తోంది. మిగతా అన్నిరంగాల్లాగే కరోనా కాలంలో ఇదీ ఒడిదొడుకులను ఎదుర్కొని కోలుకుంటోంది. ఇంటర్‌ తరువాత దీన్ని కెరియర్‌గా ఎంచుకోవాలనుకునేవారికి కోర్సులెన్నో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్చు!

aviation courses after intermediate to take aviation sector as career
వైమానికం... తలమానికం!

By

Published : Jun 14, 2020, 7:53 AM IST

అనుకూలమైన వాతావరణంలో పనిచేసే అవకాశం, ఆకర్షణీయమైన వేతనం... ఉద్యోగ భద్రత! మంచి కెరియర్‌లో స్థిరపడాలనుకునేవారు ఇంతకన్నా కోరుకునే అంశాలేం ఉంటాయి? వీటిని అందించే ఏవియేషన్‌.. తాజా కొవిడ్‌ ఉపద్రవ పర్యవసానాలు మినహాయిస్తే.. మొత్తమ్మీద వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమే. దేశంలో మంచి కెరియర్‌ అవకాశాలను అందించేవాటిలో ఇదొకటి.

విమానయాన సంబంధిత కొలువులు అనగానే పైలట్లు, ఏర్‌హోస్టెస్‌లు/ ఫ్లైట్‌ అటెండెంట్లు, ట్రాఫిక్‌ కంట్రోల్‌ వంటివి గుర్తుకు వచ్చేస్తాయి. కానీ టూరిజం, ట్రేడ్, బిజినెస్, ఏర్‌పోర్ట్‌ బ్రాండింగ్‌.. ఇలా మరెన్నో ఉన్నాయి.

ఒకప్పుడు ఈ రంగానికి సంబంధించి ఉద్యోగాలను పొందాలంటే డిగ్రీ పూర్తిచేసి, ఆపై ఉద్యోగాలకు ప్రయత్నించాల్సి వచ్చేది. ఏ డిగ్రీవారైనా వాటికి దరఖాస్తు చేసుకునే వీలుండేది. సంస్థలే ఎంపికైనవారికి శిక్షణనిచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎన్నో సంస్థలు పరిశ్రమ అవసరాల దృష్ట్యా కోర్సులను రూపొందించి, అందిస్తున్నాయి. విభిన్న అవసరాలకు తగ్గట్టుగా అనుకూలమైన అంశాలతో కోర్సులను రూపొందించారు. వీటిలో టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ రెండు విధాల కోర్సులున్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా నేరుగా కొలువులను సొంతం చేసుకోవచ్చు.

డిగ్రీ, డిప్లొమా స్థాయుల్లోనూ..

ఇంటర్‌ పూర్తిచేసినవారికే కాకుండా డిగ్రీ స్థాయిలో ఏర్‌లైన్‌ మేనేజ్‌మెంట్, ఏవియేషన్‌ హాస్పిటాలిటీ, ఏర్‌లైన్‌ ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌ల్లో బీఏ, బీబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇంటర్‌ తరువాత త్వరగా కెరియర్‌లో స్థిరపడాలనుకునేవారికి డిప్లొమాలు సాయపడతాయి. ఏవియేషన్‌కు సంబంధించి ఎన్నో స్పెషలైజ్‌డ్‌ విభాగాల్లో డిప్లొమాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి తన ఆసక్తిమేరకు వీటిని ఎంచుకోవచ్చు. కోర్సుల కాలవ్యవధి ఏడాది నుంచి రెండేళ్లు. ఇంటర్‌ ఏ గ్రూపువారైనా వీటిని చదవడానికి అర్హులే.

వాటిలో ప్రముఖమైనవి

  1. డిప్లొమా ఇన్‌ ఏర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌
  2. డిప్లొమా ఇన్‌ గ్రౌండ్‌ స్టాఫ్‌ అండ్‌ క్యాబిన్‌ క్రూ ట్రైనింగ్‌
  3. డిప్లొమా ఇన్‌ ఏవియేషన్‌ హాస్పిటాలిటీ
  4. డిప్లొమా ఇన్‌ ఏర్‌ఫేర్‌ అండ్‌ టికెటింగ్‌ మేనేజ్‌మెంట్‌
  5. డిప్లొమా ఇన్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఏర్‌పోర్ట్‌ హ్యాండ్లింగ్‌
  6. ఏర్‌హోస్టెస్‌ డిప్లొమా
  7. డిప్లొమా ఇన్‌ ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌.

కమర్షియల్‌ పైలట్‌

ఏవియేషన్‌/ విమానం పేరు వినగానే గుర్తొచ్చేది పైలట్లే. దీనిపై ఆసక్తి ఉన్నవారు కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. దీనిని డీజీసీఏ గుర్తింపు పొందిన సంస్థల్లో కోర్సు పూర్తి చేయడం ద్వారా పొందొచ్చు. ఇంటర్‌ ఎంపీసీతో పూర్తిచేసినవారు అర్హులు. ప్రవేశం పొందడానికి సంస్థలు నిర్వహించే పైలట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టులో ఉత్తీర్ణత సాధించాలి. దీనిలో మూడు దశలు- రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఉంటాయి. దీనిలో అర్హత సాధించినవారికి మెడికల్, ఐ టెస్టులను నిర్వహిస్తారు. ఆపై ప్రవేశం కల్పిస్తారు.

కోర్సులో భాగంగా గ్రౌండ్, ఫ్లయింగ్‌ శిక్షణలుంటాయి. గ్రౌండ్‌ ట్రైనింగ్‌లో ఏర్‌ నేవిగేషన్, ఏవియేషన్‌ మెటియోరాలజీ, ఏర్‌ రెగ్యులేషన్స్, ఆర్‌టీఆర్, ఏర్‌క్రాఫ్ట్‌ జనరల్‌ అండ్‌ టెక్నికల్‌ అంశాలుంటాయి. ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌లో విద్యార్థి 200 గంటల ఫ్లయింగ్‌ టైమ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక డీజీసీఏ నిర్వహించే పరీక్షలో అర్హత సాధిస్తే సీపీఎల్‌ లైసెన్స్‌ పొందొచ్చు.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

  1. గవర్నమెంట్‌ ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ స్కూల్, బెంగళూరు
  2. రాజీవ్‌గాంధీ ఏవియేషన్‌ అకాడమీ, హైదరాబాద్‌
  3. ద బాంబే ఫ్లయింగ్‌ క్లబ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఏవియేషన్, ముంబయి
  4. ఐజీఐఏ- దిల్ల్లీ, చండీగఢ్, రోహ్‌తక్, ఇండోర్‌
  5. అహ్మదాబాద్‌ ఏవియేషన్‌ అండ్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌
  6. ఓరియెంట్‌ ఫ్లయిట్స్‌ ఏవియేషన్‌ అకాడమీ, మైసూరు.
  7. బీబీఏ - ఏర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌

ఏర్‌పోర్ట్‌కి సంబంధించిన మేనేజ్‌మెంట్‌ అంశాలు- కార్గో డిపార్ట్‌మెంట్, స్టాఫ్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైనవాటిని కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. ఏవియేషన్‌కు సంబంధించిన మేనేజీరియల్‌ హోదాలకు సరిపోయేలా సిద్ధం చేస్తారు. జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్‌పోర్ట్‌ మేనేజర్, అడ్మినిస్ట్రేటర్, స్టాఫ్‌ మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్‌ హోదాలకు తీసుకుంటారు.

కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. సెమిస్టర్‌ విధానం ఉంటుంది. 50% మార్కులతో ఇంటర్‌ ఏ గ్రూపుతో పూర్తిచేసినవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. చాలావరకూ సంస్థలు ప్రవేశపరీక్ష నిర్వహించి, ఎంచుకుంటున్నాయి. కొద్ది సంస్థలు మాత్రం మెరిట్‌ ఆధారంగా ఎంచుకుని, వారికి ఇంటర్వ్యూ నిర్వహించి దానిలోనూ అర్హత సాధిస్తే ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

  1. నేషనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఏవియేషన్, చెన్నై
  2. ఆప్‌టెక్‌ ఏవియేషన్‌ అండ్‌ హాస్పిటాలిటీ అకాడమీ, బెంగళూరు
  3. ఫ్లయింగ్‌ గూస్‌ ఏవియేషన్‌ అకాడమీ, కొచ్చి
  4. స్కూల్‌ ఆఫ్‌ ఏర్‌లైన్స్‌ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, కొచ్చి.

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌

స్పెషలైజ్‌డ్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రధానమైనది. ఏర్‌క్రాఫ్ట్‌ డిజైనింగ్‌పై ప్రధాన దృష్టి ఉంటుంది. పరిశ్రమ/ సంస్థ అవసరాలకు అనుగుణంగా రూపొందించాల్సి ఉంటుంది. ఏర్‌క్రాఫ్ట్‌ ఆపరేషన్స్‌కు సంబంధించిన థియరీ, ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని కోర్సులో అందజేస్తారు. ప్రైవేటు ఏర్‌లైన్స్‌ వీరిని ఎంచుకుంటాయి. చీఫ్‌ ఇంజినీర్, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్, డిజైన్‌ ఇంజినీర్‌ మొదలైన హోదాలకు ఎంచుకుంటాయి.
నాలుగేళ్ల కోర్సు. ఇంటర్‌ ఎంపీసీతో పూర్తిచేసినవారు అర్హులు. జాతీయ (జేఈఈ), రాష్ట్రీయ ప్రవేశపరీక్షల ద్వారా ప్రవేశాలను పొందొచ్చు.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

  1. సత్యభామ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, చెన్నై
  2. దయానంద సాగర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, బెంగళూరు
  3. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్, తెలంగాణ
  4. అమిటీ యూనివర్సిటీ, నోయిడా
  5. గీతం స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌
  6. జేఎన్‌టీయూ, కాకినాడ.

బీబీఏ ఏవియేషన్‌

ఏర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌లానే ఉంటుంది. దీనిలో ట్రావెలింగ్, టూరిజానికి సంబంధించిన అంశాలకూ ప్రాధాన్యం ఉంటుంది. ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో అవసరమైన వాణిజ్య, మేనేజ్‌మెంట్, ఆపరేషన్, నాయకత్వ నైపుణ్యాలను నేర్పిస్తారు. ప్రయాణికులకు సరైన సేవలను అందించడం, విమాన రాకపోకల సవ్య నిర్వహణ, సమయానికి నాణ్యమైన సేవలు అందేలా చూడటంతోపాటు వీటిపరంగా ఏర్పడే సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను అందిస్తారు. ఏర్‌పోర్ట్‌ ప్లానింగ్, సెక్యూరిటీ, ప్యాసెంజర్‌ ఫోర్‌కాస్టింగ్, ఏరోడ్రోమ్‌ వర్క్స్, ఫైర్‌ సేఫ్టీ మొదలైన అంశాలు ఇందులో భాగం. ఏవియేషన్, ఏర్‌లైన్‌ సంస్థలు వీరిని క్రెడిట్‌ కంట్రోల్‌ మేనేజర్, ఏర్‌పోర్ట్‌ మేనేజర్, టెస్ట్‌ మేనేజర్, ఏర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ మొదలైన హోదాల్లో నియమించుకుంటాయి.

మూడేళ్ల కోర్సు. సెమిస్టర్‌ విధానం ఉంటుంది. ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. చాలావరకూ సంస్థలు గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం తమకంటూ ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష నిర్వహించి తీసుకుంటున్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

  1. స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్, దేహ్రాదూన్‌
  2. ఆచార్య బెంగళూరు బీ స్కూలు
  3. హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్, చెన్నై
  4. గల్గోతియా యూనివర్సిటీ, నోయిడా
  5. జీడీ గోయంకా స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, గుడ్‌గావ్‌
  6. ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్, బెంగళూరు మొదలైనవి.

బీఎస్‌సీ ఏవియేషన్‌

ఏరోప్లేన్, హెలికాప్టర్లు, గ్లిడర్స్‌ మొదలైన వాటి డిజైన్, డెవలప్‌మెంట్, ప్రొడక్షన్, ఆపరేషన్, ఏర్‌క్రాఫ్ట్‌ మొదలైన సైన్స్‌ ఆపరేషన్లకు సంబంధించింది. ఏవియేషన్‌లోని అన్ని అంశాలను కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. మేనేజ్‌మెంట్, ఏర్‌లైన్‌ ఎంటర్‌ప్రైజెస్, వాటి సంబంధ బాంధవ్యాలు మొదలైన అంశాలపైనా దృష్టిసారిస్తారు. వీరిని ఏర్‌లైన్స్, వాటిలోని కస్టమర్‌ సర్వీసెస్, ఏర్‌పోర్ట్స్‌ల్లో టికెటింగ్‌ మేనేజర్, ఏవియేషన్‌ లైన్‌ టెక్నీషియన్, కస్టమర్‌ కేర్‌ అఫీషియల్‌ హోదాలకు తీసుకుంటారు.

ఇంటర్‌ ఎంపీసీతో పూర్తిచేసినవారు అర్హులు. ఎక్కువగా మెరిట్‌ ఆధారిత ప్రవేశాలే ఉంటాయి. కొన్ని సంస్థలు మెరిట్‌తోపాటు ఇంటర్వ్యూనూ నిర్వహిస్తున్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

  1. ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ, హైదరాబాద్‌
  2. ఏపీ ఏవియేషన్‌ అకాడమీ, హైదరాబాద్‌
  3. వనస్థలీ విద్యాపీఠ్, జయపుర
  4. ఠాకూర్‌ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ కామర్స్, ముంబయి
  5. యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి మొదలైనవి.

ఏర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌

వైమానిక రంగంలో భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. ఏరోనాటికల్‌ ఇంజినీర్లు డిజైనింగ్, మాన్యుఫాక్చరింగ్, టెస్టింగ్‌ అంశాలకు ప్రాధాన్యమిస్తే.. ఏర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్లు ఏర్‌క్రాఫ్ట్‌లు, వాటి భాగాలు, ఇంజిన్‌ల నిర్వహణను చూసుకుంటారు. విమానం ఎన్నో విడిభాగాలు, ఇంజిన్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్‌ అంశాలు మొదలైనవాటితో తయారై ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రమాద బారిన పడొచ్చు. వాటి మరమ్మతు, నిర్వహణ సేవల బాధ్యత వీరిపై ఉంటుంది. వీటిని పరిశీలించి విమానం ఎగరడానికి వీలుగా ఉందో లేదో నిర్ణయిస్తారు. ఏర్‌క్రాఫ్ట్‌ ఇన్‌స్పెక్షన్, ప్రాబ్లమ్‌ డయాగ్నోసిస్, సమస్యల గుర్తింపు, వాటి పరిష్కారం వంటి అంశాలను కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. కోర్సు అనంతరం డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) నుంచి లైసెన్స్‌ తీసుకోవాల్సివుంటుంది. వీరిని ఏర్‌లైన్స్, ఎంఆర్‌ఓ ఇండస్ట్రీస్, ఏర్‌క్రాఫ్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ సంస్థలు మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌ హోదాతో తీసుకుంటాయి.

కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. సెమిస్టర్‌ విధానం ఉంటుంది. కోర్సు కాలవ్యవధిలో ఆరు నెలల జాబ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ఉంటుంది. ఇంటర్‌ ఎంపీసీతో పూర్తిచేసినవారు అర్హులు. సంస్థను బట్టి ఎంపిక ప్రక్రియ మారుతోంది. కొన్ని సంస్థలు మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తుంటే కొన్ని ప్రవేశపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

  1. జేఎన్‌టీయూ, కాకినాడ
  2. అమిటీ యూనివర్సిటీ, నోయిడా
  3. వింగ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ టెక్నాలజీ, పుణె
  4. టీఐఏటీ, ముంబయి
  5. అకాడమీ ఆఫ్‌ ఏవియేషన్‌ అండ్‌ ఇంజినీరింగ్, బెంగళూరు
  6. ఉత్కల్‌ ఏరోస్పేస్‌ అండ్‌ ఇంజినీరింగ్, భువనేశ్వర్‌

ABOUT THE AUTHOR

...view details