ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) మాట్లాడినట్లుగా చెబుతూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంభాషణల వెనుక ఉన్నదెవరనేది చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రయోజనం ఆశించి వాటిని ప్రచారం చేశారు ? ఆడియోలో మాట్లాడిన గొంతులు ఎవరివనే విషయాలు చర్చకు దారితీశాయి.
తాజాగా పార్ట్-2 సంభాషణ
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురువారం రాత్రి విలేకర్ల సమావేశం నిర్వహించి మరీ...ఆ ఆడియోతో తనకు సంబంధం లేదని ప్రకటించారు. అయితే గురువారం నాటి క్లిప్పింగులకు కొనసాగింపుగా ‘పార్ట్-2’ పేరుతో మరో ఆడియో బయటకు వచ్చింది. అందులో మహిళ ఎవరో గుర్తించినట్లు ప్రచారం సాగింది. విషయం తెలుసుకున్న కొందరు వైకాపా నేతలు సదరు పేరు గలవారితో మాట్లాడి ఆరాతీయగా...ఆ మాటలు తనవి కావని, దాంతో తనకు సంబంధం లేదని ఆమె వివరించినట్లు తెలుస్తోంది. ఎవరో గిట్టనివాళ్లు తన పేరు ఉపయోగించి ఉండొచ్చని చెప్పినట్లు తెలుస్తోంది.
సైబర్ క్రైం పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు. సంభాషణల ఆడియోలను సామాజిక మాధ్యమాల్లో ఎవరు పోస్ట్ చేశారన్న విషయం తెలిస్తే వారి నుంచి కీలక సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. పోస్ట్ చేసినవారి వివరాల కోసం పలు ప్రశ్నలతో యూట్యూబ్, ఫేస్‌బుక్ సంస్థల ప్రతినిధులకు లేఖలు రాశారు. ఈ వ్యవహారంపై వైకాపా అధిష్ఠానం కూడా ఆరా తీసినట్లు సమాచారం.