Andhra pradesh Free Houses issue : ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపట్టిన గృహనిర్మాణాలను వేగిరం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అన్నిస్థాయుల అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని వినియోగిస్తున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్, గృహనిర్మాణ శాఖ ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్‌లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు లబ్ధిదారుల దగ్గరకు వెళుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సర్పంచి, ఎంపీటీసీలను భాగస్వాములను చేస్తున్నారు. పథకంపై అవగాహన కల్పించే పేరుతో లబ్ధిదారుల దగ్గరకు వరుస కడుతున్నారు. నిర్మాణాలకు ముందుకురాని పక్షంలో నోటీసులు జారీ చేస్తామని కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు చెబుతున్నారు. ఇల్లు కట్టుకునేందుకు ఇప్పుడు చేతిలో డబ్బుల్లేవ్ అని మొత్తుకుంటే... ఆ విషయాన్ని కాగితంపై రాసివ్వాలని లబ్ధిదారులకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే లబ్ధిదారుల నుంచి లిఖిత పూర్వకంగా పత్రాలు తీసుకున్నారు.
స్వచ్ఛందంగానే రాసివ్వండి....
పథకం కింద మొదటి విడతగా ప్రభుత్వం 15.75 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 13.26 లక్షల వరకు నిర్మాణాలు ప్రారంభంకాగా వాటిలో 1.99 లక్షల గృహాలు పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో ఆశించినస్థాయిలో పురోగతి లేదు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికారులు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఆ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పథక ప్రయోజనాల్ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కింద రూ.1.80 లక్షలు ఇస్తున్నాయని, పావలా వడ్డీ కింద రూ.35 వేలు రుణం ఇప్పిస్తామని చెబుతున్నారు. అయినా నిర్మాణాలకు ధైర్యం చేయడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు ఎక్కడ సరిపోతాయని అధికారుల్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆప్షన్-3 కింద ఎంపిక చేసుకున్నామని, ప్రభుత్వమే కట్టిస్తామని చెప్పిందని మరికొందరు స్పష్టం చేస్తున్నారు. తాము నివసిస్తున్న ప్రాంతానికి దూరంగా ఉన్న లేఅవుట్‌లో స్థలం కేటాయించారని అక్కడికి వెళ్లి ఇల్లు కట్టుకుని ఎలా బతకాలని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. తమపై ఉన్నతాధికారుల ఒత్తిడి ఉందని ఇల్లు కట్టుకోలేమంటే అందుకు కారణమేమిటో రాతపూర్వకంగా స్వచ్ఛందంగా రాసివ్వాలని అధికారులు కోరుతున్నారు.
మౌఖిక ఆదేశాలు...