పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిపోయిన ప్రాంతంలో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసేందుకు 24 గంటలకు పైగా సమయం పడుతుందని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. గేటు విరిగిపోవడానికి గల కారణాలపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తాత్కాలిక గేటు ఏర్పాటు కోసం జలాశయంలో నీటిని ఖాళీ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీటు నిర్మాణాల్లో ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
పులిచింతల నుంచి భారీగా నీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 16వ నెంబర్ గేటు ఊడిపోయింది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు అధికారుల చర్యలు చేపట్టారు. 11 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటిమట్టం తగ్గిస్తేనే... తాత్కాలిక గేటు ఏర్పాటుకు అవకాశం ఉంది. డ్యామ్ వద్దకు చేరుకుని అధికారులతో మంత్రి అనిల్ పరిశీలించారు. గేట్లు నిర్మించిన బెకాన్ సంస్థ ప్రతినిధులతో పాటు నాగార్జున సాగర్, తుపాకుల గూడెం నుంచి ఇంజినీరింగ్ నిపుణులు అక్కడికి వచ్చారు.
అప్రమత్తంగా ఉండాలి
సాంకేతిక సమస్య కారణంగా పులిచింతల ప్రాజెక్టు గేట్ ఊడిపోవటంతో ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు విడుదల అవుతోంది. దీంతో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేశారు. ఊడిన గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయాల్సి ఉందని ఈ కారణంగా డ్యాంలో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోందని అధికారులు వెల్లడించారు. నీటి ఒత్తిడి ఇతర గేట్లపై పడే అవకాశం ఉన్నందున నీటి మట్టాన్ని తగ్గించిన అనంతరం మరమ్మతులు చేపట్టనున్నారు.
ప్రకాశం బ్యారేజీకి భారీ వరద