ప్రముఖ రచయిత, బహుభాషావేత్త డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి ఇకలేరు. హైదరాబాద్ చైతన్యపురిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1935లో తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ఆయన జన్మించారు. కాకినాడలో విద్యాభ్యాసం చేశారు. తెలుగు కథానికపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 1969 నుంచి 93 వరకు తెలుగు అకాడమీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన డిప్యూటీ డైరెక్టర్‌గా పదవీవిరమణ పొందారు.
ఉత్తమ అనువాదకులు:
ఈనాడు పాత్రికేయ పాఠశాలలో తెలుగు ఆచార్యునిగా సేవలందించారు. తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ మాండలికాల్లో రచనలు చేసిన మొదటి వ్యక్తిగా ఖ్యాతి గడించారు. పరమహంస యోగానంద రాసిన యాన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ సెయింట్ అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి తెలుగులో ఒకయోగి ఆత్మకథగా అనువదించారు. ఉత్తమ అనువాదకుని అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆయనను అక్షర తపస్విగా సాహితీవేత్తలు భావిస్తుంటారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.