ప్రగతి భవన్ ముట్టడికి రైతు ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రైతులు విఫలయత్నం చేశారు. ప్రగతిభవన్ ఎదుట మౌన దీక్ష చేయడానికి కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి తరలి వచ్చిన రైతు ప్రతినిధులను సమీపంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వానాకాలం సీజన్ ఆరంభంలో ముఖ్యమంత్రి సూచన మేరకు ధాన్యం సన్నరకం సాగుచేసినట్లు రైతులు తెలిపారు. అందువల్ల క్వింటాకు రూ. 2,500 చొప్పున చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు ఐక్యవేదిక డిమాండ్ చేసింది. క్షేత్రస్థాయిలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు సరిగా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు కనీస మద్దతు ధరలు రాక మరింత నష్టపోతున్నారని ఐక్యవేదిక ఆందోళన వ్యక్తం చేసింది. రైతుల కష్టాలు చెప్పుకునేందుకు ప్రగతిభవన్‌కు బయలుదేరితే పోలీసులు అడుగడుగునా అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారని వాపోయారు.
వరి సన్నరకాలు సాగుచేస్తే లాభసాటిగా ఉంటుందని ప్రభుత్వం చెబితేనే రైతులు పంట వేశారని.. చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు, వరదలతో భారీ నష్టం వాటిల్లిందన్నారు. రంగు మారిపోవడం వల్ల ధాన్యం విక్రయించుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. తక్షణమే ప్రభుత్వం రంగంలోకి దిగి అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లించి కొనుగోలు చేయాలని రైతు ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ప్రగతి భవన్ ముట్టడికి రైతు ఐక్యవేదిక విఫలయత్నం ఇవీచూడండి:అవగాహనాలోపం.. భక్తులకు తప్పని ఇబ్బందులు