రాజధానిలో కొన్ని కీలకమైన లింకు రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కిందటే పచ్చజెండా ఊపింది. నగరంలో 250 రోడ్లను రూ.250 కోట్లతో నిర్మించాలని హైదరాబాద్ రోడ్ల అభివృద్ధి సంస్థ(హెచ్‌ఆర్‌డీసీ) తలపెట్టింది. 50 పూర్తయ్యాయి. లింకు రోడ్ల వల్ల దూరం తగ్గిపోయి తక్కువ సమయంలో వాహనదారులు గమ్యస్థానాలకు చేరుతున్నారు. అత్తాపూర్ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే వంతెన 118 స్తంభం నుంచి మొదలై, మూసీ ఆనుకొని ఉన్న రోడ్డు బాపూఘాట్ వరకు ఉంది. బాపూఘాట్ వంతెన నుంచి అత్తాపూర్ వైపు అర కి.మీ. రోడ్డు ఇప్పటికీ వేయలేదు. మూసీ కొంత భాగాన్ని పూడ్చి ఈ లింకు కలిపితే ప్రయోజనం ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. పరిశీలించిన మంత్రి కేటీఆర్ తక్షణం నిర్మాణాన్ని పూర్తి చేయమని ఆదేశించారు.
రూ.3.40 కోట్ల వ్యయమయ్యే ఈ రోడ్డు నిర్మాణానికి హెచ్‌ఆర్‌డీసీఎల్ అధికారులు ఏడాది కిందట టెండరు పిల్చి గుత్తేదారుకు అప్పగించారు. మూడు నెలల కిందట నిర్మాణం పూర్తికావడంతో వాహనాలను అనుమతించారు. దీనివల్ల అత్తాపూర్ నుంచి బాపూఘాట్ వంతెన దాటి నేరుగా నార్సింగి మీదుగా ఓఆర్‌ఆర్, మరోవైపు చిలుకూరు వైపు వెళ్లడానికి అవకాశం ఏర్పడింది. మూడు నాలుగు కి.మీ. తిరిగి వెళ్లాల్సిన బాధ తప్పింది. ఇటీవల హిమాయత్‌సాగర్ నుంచి నీళ్లు వదలడంతో మూసీలోకి వేలాది క్యూసెక్కులు ప్రవహించాయి.