స్వగ్రామాలకు వెళ్లి తాము మనశ్శాంతిగా బతికేరోజు ఎప్పుడని వారు ఆవేదన చెందుతున్నారు. పార్టీ కార్యకర్తలు ఊరొదిలి వెళ్లడం, భూములు బీళ్లు పడటం వంటివి తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. స్పందించిన ఆయన సుమారు ఏడాదిన్నర క్రితం గుంటూరు కేంద్రంగా వైకాపా పునరావాస బాధితుల కేంద్రం ఏర్పాటు చేసి వారందర్నీ అక్కడకు పిలిపించారు. రక్షణ కల్పించకపోతే తానే వీరిని తీసుకెళ్లి గ్రామాల్లో వదిలిపెడతానని హెచ్చరించారు. నాడు పోలీసులు స్పందించి కొందర్ని గ్రామాలకు తీసుకెళ్లి ఇరువర్గాలు ప్రశాంతంగా జీవనం సాగించాలని కౌన్సెలింగ్ చేశారు. అదీ మూణ్ణాళ్ల ముచ్చటగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ పల్నాట కొన్ని గ్రామాల్లో భయానక వాతావరణంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలీసు పికెట్లున్నా తమపై యథావిధిగా దాడులు జరుగుతున్నాయని పిన్నెల్లిలో పలువురు చెప్పారు. దీంతో ఆ ఊళ్లో తెదేపా మద్దతుతో పోటీ చేయటానికి ఆసక్తి కనబరిచేవారే కరవయ్యారని మాజీ సర్పంచి మొహిద్దీన్‌బీ భర్త జానీభాషా వివరించారు.
- పిన్నెల్లికి చెందిన ఓ తెదేపా సానుభూతిపరుడి కుమారుడికి ఇటీవల వివాహమైంది. ప్రత్యర్థులు దాడి చేస్తారని భయపడి సొంతింట్లో కాకుండా.. కారంపూడిలో అద్దె ఇంట్లో శుభకార్యం జరుపుకోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లో నుంచి వెళ్లగొట్టి బతుకుదెరువు లేకుండా చేశారని కన్నీరుమున్నీరయ్యారు.
- పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన 70ఏళ్ల వృద్ధురాలికి ఎకరం పొలం ఉంది. ఆమె కుటుంబం గత సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా తరఫున పని చేసింది. తర్వాత వృద్ధురాలి కుమారులను ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకోవడంతో వారు ఊరు వదిలి వెళ్లిపోయారు. వారి భూములను ఎవరూ కౌలుకు తీసుకోకూడదని ప్రత్యర్థులు హుకుం జారీ చేయటంతో భూమి బీడుపడింది. ఆ వృద్ధురాలికి ఫలసాయం వచ్చే పరిస్థితి లేక, పొట్ట పోసుకోవడానికి నానా అవస్థలు పడుతోందని ఆమె మనవడు సురేష్ కుమార్ తెలిపారు. ఈ గ్రామం నుంచి 10 కుటుంబాలు వెళ్లిపోయాయి.
- మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో ప్రత్యర్థులు దాడులు తట్టుకోలేక 15 కుటుంబాలు గ్రామాన్ని వీడాయి.
పంచాయతీ సందడేదీ?
పల్నాడులో ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో రెంటచింతల, దుర్గి, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో పంచాయతీ ఎన్నికల ఊసే లేకుండా ఉంది. ఇక్కడ చాలా వరకు ఏకగ్రీవం దిశగా చర్చలు సాగుతున్నాయి. బరిలో నిలిచే అభ్యర్థుల గురించే అసలు గ్రామాల్లో చర్చే జరగటం లేదని చెబుతున్నారు. గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి, గురజాల, మాచవరం మండలాల్లోని పలు గ్రామాల్లోనూ పోటీచేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఎవరైనా ఆసక్తి చూపితే వారికి ఉప సర్పంచి ఇస్తామని బేరసారాలకు దిగుతున్నారు. కాదంటే కటకటాల పాల్జేస్తామని బెదిరిస్తున్నారని.. తెదేపా నాయకుడొకరు చెప్పారు. ఆఖరికి పోలీసుశాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవడానికి వెళ్లినా బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.