Attack on YSRCP Leader House in Ongole : ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తా ఇంటిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ నెల 12న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా సుబ్బారావు గుప్తా.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వారు మాట్లాడుతున్న భాష, వ్యవహారశైలి అభ్యంతరకరమని.. ఫలితంగా పార్టీకి 20 శాతం వరకు ఓటింగ్ తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో తెదేపా గెలిస్తే.. వైకాపా కార్యకర్తలను కర్రలతో తరిమి కొడతారని ఆందోళన వ్యక్తం చేశారు.
Attack on YSRCP Leader Prakasham : ఈ నేపథ్యంలో పూటుగా మద్యం తాగిన 15 మందికి పైగా వ్యక్తులు లంబాడీడొంకలోని సుబ్బారావు గుప్తా నివాసానికి శనివారం రాత్రి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. అయినప్పటికీ అతన్ని దుర్భాషలాడుతూ ఇంట్లోకి ప్రవేశించి బెదిరింపులకు దిగారు. అంతుచూస్తామని హెచ్చరిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. వారిని సుబ్బారావు గుప్తా భార్య ప్రతిఘటించటంతో అక్కడి నుంచి బయటికి వచ్చారు.