తెలంగాణ

telangana

ETV Bharat / city

అమరావతి మహిళలపై దాడి దారుణం: చంద్రబాబు - Amaravati Farmers Agitation

అమరావతి మహిళలపై దాడి చేయడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హక్కు కల్పించాలని కోరితే.. భౌతిక దాడులు చేస్తారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి రైతులతో ప్రభుత్వం తరఫున ఒప్పందం చేసుకున్నామని.. అమరావతి రైతులతో మార్చుకోలేని ఒప్పందం జరిగిందని వివరించారు.

attack-on-women-in-amravati-is-brutal-chandrababu
అమరావతి మహిళలపై దాడి దారుణం: చంద్రబాబు

By

Published : Mar 9, 2021, 10:47 PM IST

అమరావతి మహిళలపై దాడి దారుణం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​లో ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి ఆటవిక రాజ్యం తెచ్చారని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. మహిళా దినోత్సవం రోజున విజయవాడ దుర్గగుడికి వెళ్తున్న మహిళలపై పోలీసుల వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. పోలీసుల చేతిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు తుళ్లూరుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు.

విధ్వంసం కోసమే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని.. అమరావతితో పాటు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి పట్టిన శని గ్రహం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఈ మాదిరిగా ఆలోచించి ఉంటే రెండు రోజులు కూడా ఉండేవారు కాదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి బాబాయ్ హత్య కేసు, కోడి కత్తి కేసు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు.

మహిళా రైతులపై దాడి నాగరిక సమాజం సిగ్గుపడే అంశమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు అతి చేస్తున్నారని.. అన్ని రోజులు ఒకేలా ఉండవని గుర్తించాలన్నారు. ధర్మం అమరావతి రైతుల వైపు ఉంది.. అంతిమంగా విజయం వారిదేనని ధైర్యం చెప్పారు. మహాభారతంలో ద్రౌపతి చీర లాగి కౌరవులు సంతోషించారు.. కానీ కురుక్షేత్రంలో పాండవులు మట్టి కరిపించారని గుర్తు చేశారు. అన్నిచోట్ల పులివెందుల పంచాయితీ పెట్టి ప్రజలను బెదిరిస్తున్నారని విమర్శించారు. వాళ్లు నేరాలు చేసి.. కేసులు మాత్రం ప్రజలపై పెడుతున్నారని ఆరోపించారు.

జగన్ రెడ్డి అంత పిరికివాడు మరొకరు ఉండరని.. అందుకే అమరావతి రావాలంటే వందలాది మంది పోలీసులను వెంట తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అనే ముద్ర వేసినట్లు.. అమరావతి విషయంలో కులం ముద్ర వేశారని పేర్కొన్నారు. హైదరాబాద్​లో అప్పుడు.. అమరావతిలో ఇప్పుడు ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి తన మానస పుత్రికని.. కష్టం మొత్తం బూడిదలో పోసినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయటం కష్టం... విధ్వంసం చేయటం చాలా సులువని వ్యాఖ్యానించారు. అన్ని రోజులు ఒకేలా ఉండవని.. చరిత్రలో ద్రోహిగా, దుర్మార్గునిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రిని హెచ్చరించారు.

ఇదీ చదవండీ.. ఈనెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details