తెలుగుదేశం ఏపీ కార్యవర్గం ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. ఏపీ అధ్యక్షుడి నియామకంపై... ఆయన ఇది వరకే పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో.... పార్టీని నడిపించాలంటే అచ్చెన్నాయుడు లాంటి దూకుడు నేత అయితేనే సబబు అనే.. అభిప్రాయం అధిక శాతం మంది వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో సీనియర్లు, యువనేతలు, క్యాడర్ అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే.. ఈ నియామకానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఒకానొక దశలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరును కూడా.... పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పరిశీలించారు. చిన్న వయసు కావడం సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయనే భావన వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు సేవలను వేరే విధంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పార్టీ నేతలతో చాలా సమన్వయంగా కళా పని చేశారని పలు సందర్భాల్లో కితాబిచ్చారు.