రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 364 మంది మహమ్మారి బారిన పడినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన రెండు నెలల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. ఫిబ్రవరిలో రోజుకు రెండు వందలు దాటని కేసులు ఇప్పుడు ఏకంగా మూడొందల పైచిలుకే నమోదవుతున్నాయి. మరో వైపు కొవిడ్ బారిన పడుతున్న వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోవటం ఆందోళన కలిగిస్తున్న విషయం. రోజురోజుకు అసింప్టమాటిక్ కేసులు పెరగటం పట్ల వైద్య,ఆరోగ్య శాఖ ఆందోళ వ్యక్తం చేస్తోంది.
కోరలు చాస్తోంది
సరిగ్గా ఏడాది క్రితం ఇదే మార్చి నెలలో కొవిడ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు చేసినా, ఐసోలేషన్లు ఏర్పాటు చేసినా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోయాం. ఒక్కటిగా మొదలైన కరోనా కేసులు నిత్యం పదులు, వందలు, వేల నుంచి ఏకంగా లక్షల్లో నమోదయ్యాయి. కంటైన్మెంట్లు, లాక్డౌన్లతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినా.. మళ్లీ కరోనా కోరలు చాస్తోంది.
చిన్నారులపై పంజా
ముఖ్యంగా చిన్నారులపై పంజా విసురుతోంది. తొలినాళ్లలో జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, శ్వాస ఇబ్బందులు ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారు. ఇప్పుడు లక్షణాలు కనిపించకపోవడం వల్ల ఆ పరిస్థితి లేదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొవిడ్ సోకిన సుమారు 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవడం వల్ల ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో గుర్తించడం ఇబ్బందికరంగా మారింది.
90 శాతం అసింప్టమాటిక్ కరోనా
గతంలోనూ ఎలాంటి లక్షణాలు లేని వారు కరోనా బారిన పడేవారు. అయితే అది 70 శాతంగా ఉన్నా.. ఇప్పుడది కాస్తా 90 శాతానికి పెరిగింది. ఫలితంగా లక్షణాలు లేని వారు తమకేం వ్యాధి సోకలేదని భావించం తద్వారా ఇతరులకు వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం పెరిగిందని డీహెచ్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.