గవర్నరు ఆమోదించాక కోర్టుల్లో ప్రశ్నించలేరు..
'చట్టాలు చేసే క్రమంలో విధానపరమైన లోపాలు చోటుచేసుకున్నా.. ఆ చట్టాలకు రాష్ట్రపతి లేదా గవర్నరు సమ్మతి తెలిపాక వాటిని న్యాయస్థానాల్లో ప్రశ్నించలేరు. శాసనసభ ఆమోదించిన బిల్లులను అధికరణ 226 కింద ప్రశ్నించడానికి వీల్లేదు. ఆ బిల్లులపై మండలిలో రెండుసార్లు చర్చించారు. అక్కడ నిర్ణయం తీసుకోకపోవడంతో అధికరణ 197 ప్రకారం శాసనసభాపతి వ్యవహరించారు. రెండు బిల్లుల్ని శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించారన్న పిటిషనరు వాదన అవాస్తవం. వాటిని సాధారణ సమావేశంలోనే జనవరి 20న ఆమోదించారు. మండలి ఛైర్మన్ బిల్లుల్ని తన విచక్షణాధికారం ప్రకారం సెలక్ట్ కమిటీకి సిఫారసు చేస్తున్నానని ప్రకటించారు. సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపేందుకు తీర్మానం ప్రవేశపెట్టడం కాని, ఓటింగ్ కానీ జరగలేదు. నిబంధనల ప్రకారం.. తీర్మాన ప్రక్రియ నిర్వహించకుండా సెలక్ట్ కమిటీకి బిల్లులు పంపే విచక్షణాధికారం లేదు. సభ నిర్ణయం లేకుండా సెలక్ట్ కమిటీ ఏర్పాటు తగదని నిబంధనలున్నాయి.
బిల్లులు ఆమోదం పొందినట్లే.. హైకోర్టులో శాసనసభ కార్యదర్శి కౌంటర్ - పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో కౌంటర్ వార్తలు న్యూస్
పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు ఇంకా శాసన మండలి సెలక్ట్ కమిటీ ముందు ఉన్నాయన్న వాదన సరికాదని ఏపీ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు హైకోర్టుకు వెల్లడించారు. మండలి నుంచి నిర్ణీత సమయంలో బిల్లులు తిరిగి వెళ్లకపోతే అధికరణ 197(2) ప్రకారం ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే భావించాలని స్పష్టం చేశారు. ఈ బిల్లుల వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘనేమీ జరగలేదని చెప్పారు. ఈ రెండు బిల్లులను సవాలు చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఆయన కౌంటర్ వేేశారు.
బిల్లులు ఆమోదించలేదంటే ఎలా?
పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు ఇంకా సెలక్ట్ కమిటీ ముందున్నాయని పిటిషనర్ చెప్పడం సరికాదు. ప్రభుత్వ పాలసీని నిరాకరిస్తూ రూల్ 71 కింద తెదేపా నోటీసిస్తూ మోషన్ ప్రారంభించిందని పిటిషనర్ చెబుతున్నారు. ప్రభుత్వ పాలసీని నిరాకరించడం, శాసనాలు చేయడం వేరు. రూల్ 71 ప్రకారం నోటీసివ్వడం చట్టాలు చేయడానికి ఆటంకం కాదు. రెండు బిల్లులు ఆమోదం పొందలేదని మండలి ఛైర్మన్ ధ్రువీకరించినట్లు పిటిషనర్ చెబుతున్నారు. దానికి ఎలాంటి రికార్డులూ లేవు. ఆ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషనర్ వాదననూ తిరస్కరిస్తున్నాం. వాటిని ఆమోదించే విషయంలో శాసనప్రక్రియను పాటించాం. శాసనమండలి ప్రారంభమయ్యాక బిల్లులు నిలుపుదల చేయడం ఇదే మొదటిసారి. మండలి నుంచి నిర్ణీత సమయంలో బిల్లులు తిరిగి వెళ్లకపోతే అధికరణ 197(2) ప్రకారం ఆ బిల్లులు పాసైనట్లే భావించాలి. బిల్ రిజిస్టర్‌లో రెండు బిల్లుల గురించి నమోదు చేయలేదన్న పిటిషనర్ వాదనలోనూ వాస్తవం లేదు. మండలి రద్దు కోసం ముఖ్యమంత్రి, శాసనసభ పక్షనాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 27న నోటీసిచ్చారు. 133 మంది సభ్యులు రద్దుకు ఓటేశారు. రద్దు తీర్మానంపై తగిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. రాజకీయ కారణాలతో మండలిని రద్దు చేశారన్న పిటిషనర్ వాదన సరికాదు' అని వివరించారు.వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాన్ని కొట్టేయాలని బాలకృష్ణమాచార్యులు కోర్టును కోరారు.
ఇదీ చదవండి:ధరణిలో పాత సమాచారమే.. మార్పు కోసం రైతుల ఎదురుచూపులు