హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్ (55) గురువారం రాత్రి కరోనాతో కన్నుమూశారు. ఈ స్టేషన్లో ఇప్పటికే పలువురు కరోనా బారిన పడటంతో ప్రేమ్‌కుమార్ ఈనెల 7న నేచర్‌క్యూర్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గా తేలింది.
కొవిడ్ 'పరీక్ష' తప్పాడు.. ప్రాణాలొదిలాడు
అవేం పరీక్షలో.. అదేం రోగమో తెలీదు! కరోనా కన్నీళ్లు తెప్పిస్తోంది.. పరీక్షల్లో తేలకముందే ఒంటిని గుల్ల చేసేస్తోంది.. చివరకు ప్రాణాలు తోడేస్తోంది.
శ్వాస సమస్యగా ఉండడంతో ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ సీటీస్కాన్ చేసిన వైద్యులు ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో మళ్లీ నేచర్‌క్యూర్ ఆసుపత్రికి వెళ్లగా.. ఇక్కడ ఆక్సిజన్ సౌకర్యం ఉండదని.. గాంధీకి వెళ్లాలని చెప్పారు. రిపోర్టులో నెగెటివ్ అని ఉండటంతో గాంధీలో చేర్చుకోలేదు. చివరకు కింగ్‌కోఠిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆక్సిజన్ అందిస్తుండగా మధ్యలో అయిపోయింది. ఆదివారం రాత్రి సికింద్రాబాద్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. తాత్కాలికంగా ఆక్సిజన్ అందించారే తప్ప ఇన్‌పేషెంటుగా చేర్చుకోలేదు. ఆదివారం అర్ధరాత్రి దాటాక గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే పల్స్ తక్కువగా ఉండడంతో గాంధీలో చేర్చుకున్నారు. పోలీసు అధికారుల సూచనతో కుటుంబ సభ్యులు ప్రేమ్‌కుమార్‌ను సోమవారం అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండుసార్లు పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలింది. బుధవారం మరోసారి పరీక్షలు నిర్వహించగా.. గురువారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటికే వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ప్రేమ్‌కుమార్ గురువారం రాత్రి మృతిచెందారని కుటుంబసభ్యులు తెలిపారు. మొదట్లోనే ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా చేర్చుకోకపోవడంతోనే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి