ఏపీ అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ అవధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. పెనుగొండకు చెందిన ప్రకాష్ రావు 1944 ఆగస్టు 2న కుల్లాయమ్మ, పకీరప్పకి జన్మించారు. ఆయన ఎస్ఎస్ఎల్సీ నుంచి ఎంఏ తెలుగు వరకు అనంతపురంలోనే చదువుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పదవి విరమణ చేశారు.
రచనలు
రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 150కి పైగా అవధానాలు చేశారు. పుష్పాంజలి, లోకలిలా సూక్తం, మెరుపు తీగలు, దీవన సేసలు, రామకథ కలశం, పార్వతి శతకం, ఆత్మతత్వ ప్రబోధం, అవధాన చాటువులు, అవధాన కౌముది, వివేక పునీత నివేదిత వంటి పద్య రచనలు చేశారు. రాప్తాటి పరిచయ పారిజాతం, దోమావధాని, సాహితీ కుంజర మూర్తిమత్వం, ప్రసార కిరణాలు, సమారాధన, భాగవత సౌరభం, సువర్ణ గోపురం, ప్రహ్లాద చరిత్ర ఎర్రన్న, పోతనల తులనాత్మక పరిశీలన వంటి విమర్శ రచనలు చేశారు. నిరోష్ఠ్య శతకం, భర్తృహరి వైరాగ్యసతి వంటి వ్యాఖ్య రచనలు చేశారు. చల్లపిల్లరాయ చరిత్రం వంటి పరిష్కరణలు ఆర్కెస్ట్రా, నడిచే పద్యం నండూరి వంటి సంకలనాలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రలు కలిపి మొత్తం 57 రచనలు వెలువరించారు.