అందరూ నిర్దోషులైతే బాబ్రీ మసీదును ఎవరు కూల్చారని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ‘అదేమైనా మంత్రజాలమా? ఎవరు కూల్చారో ప్రపంచం మొత్తం చూసింది’ అని వ్యాఖ్యానించారు. కూల్చివేత ఘటనపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు గర్హనీయమన్నారు. ప్రత్యేక కోర్టు తీర్పుపై సీబీఐ అప్పీలుకు వెళ్తుందని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఒకవేళ సీబీఐ అప్పీలుకు వెళ్లకపోతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులను సంప్రదించి అప్పీలు చేయిస్తామని ఒవైసీ తెలిపారు.
మరి మసీదును కూల్చిందెవరు: అసదుద్దీన్ ఒవైసీ - ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు తీర్పు తమకు బాధను కలిగించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ కేసులో అందరూ నిర్దోషులైతే మసీదును ఎవరు కూల్చారని ప్రశ్నించారు.
గత ఏడాది నవంబరు 9న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాలకు ఈ తీర్పు వ్యతిరేకంగా ఉందని ఒవైసీ అన్నారు. ‘‘బాబ్రీ మసీదు కూల్చివేత అర్థంలేని చర్య. ఓ ప్రార్థనా మందిరాన్ని కూల్చడం చట్ట ఉల్లంఘనే’’ అని నాడు సుప్రీం పేర్కొందని వివరించారు. కూల్చివేతలో కుట్ర లేదని ఎలా చెబుతారు? ఆ రోజు కరసేవకుల్ని ఎవరు పోగు చేశారు? ఆ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు? నిర్మాణానికి అడ్డంకులున్నాయి. కూల్చడానికి కాదు.. అని నాడు యూపీ సీఎం కల్యాణ్‌సింగ్ అన్న విషయాన్ని సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది. అది వాస్తవం కాదా? అని ఒవైసీ ప్రశ్నించారు.
ఇవీ చూడండి:బాబ్రీ మసీదు కేసు.. పూర్తి కథనాలు