పక్కా ప్రణాళికతో పరీక్షలు !
ఇండియాకు సంబంధించి భూతల స్వర్గమైన కేరళలోనే మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. జనవరి 30న వూహాన్ నుంచి వచ్చిన ఓ విద్యార్థినికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కేరళతో పాటు అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అంతకుముందే వైరస్ వ్యాప్తిపై సమీక్ష జరుపుతున్న శైలజ మరింత అప్రమత్తమయ్యారు. అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ‘టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేట్’ సూత్రాన్ని పక్కాగా అమలు చేశారు. విమానాశ్రయాల్లో పకడ్బందీగా కరోనా పరీక్షలు నిర్వహించారు. చైనా నుంచి వచ్చేవారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్వారంటైన్ నిబంధనలను కట్టుదిట్టం చేశారు. వైరస్ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఐసోలేషన్ వార్డులకు తరలించారు. సోషల్ డిస్టెన్స్, మాస్కుల వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు.
ఆమె కృషి ప్రశంసనీయమంటూ !
కరోనాను కట్టడి చేసేందుకు వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ ప్రజాప్రతినిధిగా ప్రజల ప్రాణాలకు భరోసానిచ్చారు శైలజ. అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాత్రి 10 గంటల వరకు కార్యాలయంలోనే ఉండి కరోనా వ్యాప్తిపై సమీక్షలు నిర్వహించారామె. ముందుచూపుతో కరోనా మహమ్మారిని నియంత్రించడంలో చాలా వరకు విజయం సాధించారు. కేరళ ప్రభుత్వం సమర్థంగా కరోనాను ఎదుర్కొనడంలో శైలజదే కీలక పాత్ర అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు ఆమె కృషిని ప్రశంసిస్తూ ఆర్టికల్స్ ప్రచురించాయి.
ప్రశంసల వర్షం...
ఇక పబ్లిక్ సర్వీస్ డేను పురస్కరించుకుని జూన్ 23న ఐక్యరాజ్యసమితి వర్చువల్గా నిర్వహించిన ఓ కార్యక్రమంలో శైలజపై ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రాస్పెక్ట్ అనే ఓ పత్రిక ‘టాప్ 50 థింకర్స్’ పేరిట ఓ పోల్‌ను నిర్వహించింది. సుమారు 20వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో శైలజ మొదటి స్థానంలో నిలిచారు. ఇక దేశం నుంచే కరోనాను తరిమికొట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెన్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.
నాకు వైద్యం తెలియదు !
కరోనా నియంత్రణకు సంబంధించి అందరి ప్రశంసలు అందుకుంటున్న 63 ఏళ్ల శైలజ వైద్యురాలేమీ కాదు. అంతేకాదు.. ఆమె మంత్రి పదవిని చేపట్టడం కూడా ఇదే మొదటిసారి. కేరళలోని కన్నూర్ జిల్లా కూతుపరంబాలో జన్మించిన శైలజ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత కన్నూరులోని శివపురం హైస్కూల్‌లో సైన్స్ టీచర్‌గా పనిచేశారు. కళాశాలలో చదువుతున్నప్పుడే సీపీఐ(ఎం) భావజాలం పట్ల ఆకర్షితురాలైన ఆమె ఆ పార్టీ విద్యార్థి విభాగంలో చేరారు. 2004లో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ తీసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు.